పుట్టపర్తి టౌన్ : కొంత కాలంగా పుట్టపర్తిలో వివాదాస్పదంగా తయారైన కరణం రాజగోపాలరావు కుమారుడు కరణం రామకృష్ణ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఇటీవల పట్టణ పరిధిలో ఆయనకు చెందిన రూ.కోట్లాది విలువైన ఆస్తులపై కన్నేసిన స్థానిక టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి రచ్చరచ్చ చేశారు. ఈ వ్యవహారం వివాదాలకు, ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ విషయం తెరపైకి వచ్చింది. కానీ ఆయన ఎక్కడున్నారో తెలియలేదు.
ఎట్టకేలకు బెంగళూరులో తన కుమారుడి వద్ద ఉంటున్నట్లు తెలుసుకున్నారు. స్థానికుల కథనం మేరకు... దాదాపు 30 సంవత్సరాల క్రితం రామకృష్ణ పుట్టపర్తిని వదిలి వెళ్లిపోయారు. 2000 సంవత్సరంలో ఆయన తండ్రి గోపాలరావు హత్యకు గురయ్యారు. అప్పుడు కూడా ఆయన రాలేదు. తర్వాత గోపాలరావు ఆస్తిని వారసులు లోక్‌అదాలత్ ద్వారా పంచుకున్నారు. రామకృష్ణ వాటాగా వచ్చిన 18 ఎకరాలను అలాగే ఉంచారు. అయినప్పటికీ ఆయన పుట్టపర్తికి రాలేదు. దీంతో కోట్ల రూపాయల విలువ చేసే ఆ ఆస్తిని కుటుంబ సభ్యులతోపాటు, పలువురు స్థానికులు కూడా ఇష్టారాజ్యంగా అమ్మేసి అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్లు కూడా చేయించేశారు.
ఇటీవల ఆ డాక్యుమెంట్లు వెలుగులోకి రావడంతో కొనుగోలు చేసిన ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీనికితోడు పుట్టపర్తిలోని రామకృష్ణ కుటుంబ సభ్యులు కొందరు ఆయన ఆచూకీ, ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయని, విచారించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల పాటు పట్టణంలో దీక్షలు సైతం చేపట్టారు. రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును, ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసు, రెవెన్యూ అధికారులు ఆస్తుల వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేసి రామకృష్ణ ఆచూకీ కోసం విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రామకృష్ణ అత్తను విచారించి ఆయన భార్య కృష్ణకుమారి, కుమారుల అచూకీ కనుగొన్నారు. కృష్ణకుమారి గుంతకల్లులోని రైల్వే క్వార్టర్స్‌లో నివశిస్తున్నట్లు తెలుసుకుని ఆమెను విచారించారు. కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలతో మానసికంగా కృంగిపోయిన రామకృష్ణ కొంతకాలంగా బెంగళూరులో సాఫ్్టవేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కుమారుడి వద్ద ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఆయనను పుట్టపర్తికి రప్పించేందుకు సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తన బృందంతో మంగళవారం బెంగళూరు వెళ్తున్నారు.
కొసమెరుపు : ఈ ఏడాది నవంబర్‌లో రామకృష్ణ భార్య, కుమారుడు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి పుట్టపర్తిలో విలువైన తమ ఆస్తులను కొందరు అన్యాక్రాంతం చేస్తున్నారని, రామకృష్ణ చనిపోయాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే సత్యసాయి జయంతి వేడుకలలో బిజీగా ఉన్న అధికారులు ఆ ఫిర్యాదుపై దృష్టి సారించలేకపోయినట్లు సమాచారం.