'తిరుగు' ప్రయాణ కష్టాలు
'తిరుగు' ప్రయాణ కష్టాలు
Published Thu, Oct 13 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
– దసరా సెలవులు ముగియడంతో పట్టణాలకు వెళ్లిన జనం
– కిటకిటలాడిన కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్
– గంటల సేపు నిరీక్షణ.. సీట్లు లేక స్టాండింగ్ ప్రయాణం
కర్నూలు(రాజ్‌విహార్): దసరా సెలవులు పూర్తవడంతో పల్లెలకు వచ్చిన జనం పట్టణాల బాట పట్టారు. విద్యా సంస్థలు 13వ తేదీ నుంచి తెరుచుకోనుండడంతో పల్లెకు వెళ్లిన విద్యార్థులు సైతం బ్యాగులు సర్దుకొని తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో బుధవారం.. ఆర్టీసీ బస్టాండ్లతోపాటు రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. సాధారణ సర్వీసులోపాటు ప్రత్యేక బస్సులు, రైళ్లు కిక్కిరిసి నడిచాయి. సీట్ల కోసం ప్రయాణికులు సర్కర్ ఫీట్లు చేశారు. కర్నూలు కొత్త బస్టాండ్‌లో ఉదయం నుంచే ప్రారంభమైన రద్దీ సాయంత్రానికి తీవ్రమైంది. సీట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు.
హైదరా'బ్యాడ్' ప్రయాణం:
రోడ్డు రవాణ సంస్థ కర్నూలు రీజియన్ ప్రత్యేక బస్సులు నడిపినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్‌తోపాటు విజయవాడ, బెంగుళూరు, చెన్నై, నెల్లూరు తదితర ప్రాంతాలకు తీవ్ర రద్దీ నెలకొంది. 'స్పెషల్' బస్సుల్లో చార్జీలపై 50శాతం అదనంగా వసూలు చేయడంతో ప్రయాణికుల జేబులు గులయ్యాయి. కర్నూలు నుంచి అనంతపురం, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోవెలకుంట్ల, బనగానపల్లె తదితర రూట్లలో బస్సులు చాలక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఇక్కట్లపాలయ్యారు.
రైల్వేస్టేషన్ కిటకిట:
కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. ఇక్కడి నుంచి సికింద్రాబాదు (హైదరాబాదు)కు మధ్యాహ్నం 3గంటలకు తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు ఉండడంతో ఒంటి గంట నుంచే 1వ నంబరు ప్లాట్‌ఫాం కిక్కిరిసింది. మూడు కౌంటర్లు ఏర్పాటు టికెట్లు ఇచ్చినా రద్దీ తగ్గలేదు. రైలు నిండిపోయి బయలుదేరే సమయానికి కనీసం నిల్చునే స్థలం లేక వెయ్యి మంది వెనక్కి తిరిగారు. ఈరైలు సీటింగ్ కెపాటిసీ 1800 మందికాగా ..బుధవారం నాలుగు వేల మందికిపైగా ప్రయాణికులు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని బోగీలతోపాటు లగేజీ పెట్టే కూడా ప్రయాణికులతోనే నిండిపోయింది.
Advertisement
Advertisement