విద్యార్థులు సంఘటితంగా పోరాడాలి
విజయవాడ (గాంధీనగర్ ) : విద్యారంగ సమస్యలపై విద్యార్థులు సంఘటితంగా ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి కె పోలారి పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) నగర సమితి 8వ మహాసభ సోమవారం జరిగింది. తొలుత పీడీఎస్‌యూ జెండాను ఆవిష్కరించారు. మహాసభలో పాల్గొన్న పోలారి మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చి పాలక వర్గాలకు పేదలకు విద్యను దూరం చేస్తున్నాయన్నారు. డబ్బున్న వారికి నాణ్యమైన విద్య అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర మాట్లాడుతూ ప్రై వేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటును ఉపసంహరించుకోవాలన్నారు. స్కాలర్‌షిప్, బోధనా ఫీజులను విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగుల వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, నిరుద్యోగ భృతి రూ. 2వేలు చెల్లించాలని, దళితులు, మైనార్టీలపై దాడులు అరికట్టాలని మహాసభ తీర్మానించింది. మహాసభలో ఇఫ్టూ నగర కార్యదర్శి పి.ప్రసాదరావు, ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి శ్రీనివాసరావు, పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి ఎస్.రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
పీడీఎస్‌యూ నగర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగర అ«ధ్యక్షుడిగా ఐ.రాజేష్, ప్రధాన కార్యదర్శిగా బి.శ్యాంసన్, ఉపాధ్యక్షులుగా రాజు, సహాయ కార్యదర్శిగా సీహెచ్.ప్రగతి, కోశాధికారిగా భానుని ఎన్నుకున్నారు. వీరితోపాటు మరో 12మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు,