నోట్ల మార్పిడి వేగవంతం
బ్యాంకర్లకు సూచించిన కలెక్టర్ కోన శశిధర్
అనంతపురం అర్బన్ : నోట్ల మార్పిడి ప్రక్రియ వేగవంతం చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ కోన శశిధర్ బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. 34 బ్యాంకులకు సంబంధించి జిల్లాలో 454 శాఖలు ఉన్నాయని, అందుబాటులో ఉన్న నగదు, నోట్ల మార్పిడిలో ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు.
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులు, జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్‌ల నుంచి కరెన్సీ చెస్ట్‌ని పంపించాలని ఆదేశించారు. బ్యాంకుల వద్ద సమాచార కేంద్రాలు, షామియానాలు, తాగునీటి సౌకర్యం తప్పక కల్పించాలన్నారు. క్యూలో ఉన్న వారికి ఇబ్బంది కలుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎల్‌డీఎం జయశంకర్, ఎస్‌బీఐ ఏజీఎం, చీఫ్ మేనేజర్ శ్రీనివాస్, హరిబాబు, సిండికేట్ బ్యాంక్ డీసీఎం ఆశీర్వాదం, ఏపీజీబీ ఆర్‌ఎం జయశంకర్, కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ శశికుమార్, ఆంధ్రా బ్యాంక్ బ్రాంచి చీఫ్ మేనేజర్ బాలయ్య, ఎస్‌బీహెచ్ సీనియర్ మేనేజర్ సాయికృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో వాటిని మార్చుకునేందుకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంక్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం సూచించారు. ఈ నెల 24 వరకు పాత నోట్లను తీసుకోవాలని మీ సేవ కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన రాంనగర్‌లోని ఆంధ్ర బ్యాంక్, మీసేవ కేంద్రాన్ని సందర్శించారు. నోట్ల మార్పిడి ప్రక్రియను ఏ విధంగా నిర్వహిస్తున్నారనేది పరిశీలించారు. తొందరపాటు లేకుండా జాగ్రత్తగా నోట్లను మార్చుకోవాలన్నారు.