చెల్లింపుల్లేవ్
ట్రెజరీలో బిల్లులు నిలిపివేత
వేలల్లో పేరుకుపోతున్న బిల్లులు
రూ.150 కోట్ల మేర చెల్లింపులకు బ్రేక్
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలపై ఆంక్షలు
ఖజానా మళ్లీ తెల్లమొహం వేసింది. కాసులు విదల్చను పొమ్మంది. దాంతో చెల్లింపులకు బ్రేక్‌పడింది. ట్రెజరీ ఉసూరనే పరిస్థితి ఎదురైంది.
విస్తృతంగా చెల్లింపులు జరగాల్సిన తరుణంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో జిల్లా వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఖజానా స్తంభన కారణంగా వందల కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. వీటిలో రూ. 100 కోట్ల వరకు ఉపకార వేతనాలే ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో తగిలిన షాక్ కారణంగా రాబడి తగ్గడంతో, మార్చి జీతాల కోసం ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
విశాఖపట్నం : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గడిచిన మూడు నెలలుగా ఖజానాకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. రిజిస్ట్రేషన్స్, సేల్, కమర్షియల్ టాక్స్‌ల వసూళ్లు సగానికి పైగా పడిపోయాయి. నోట్ల రద్దు సమయంలో నిధుల కొరత కారణంగా డిసెంబర్‌లో ట్రెజరీ చెల్లింపులపై ఆంక్షలు విధించారు. జనవరిలో మాత్రం చెల్లింపులపై ఆంక్షలు ఎత్తివేశారు. గత నెల రోజులుగా చెల్లింపులు సజావుగానే సాగినా మళ్లీ ఫిబ్రవరిలో చెల్లింపులపై ఆంక్షలు విధించారు. ఈ నెల 8 నుంచి ట్రెజరీ ద్వారా జరిగే అన్ని రకాల చెల్లింపులపై ఆంక్షలు విధించారు. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడం, ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వచ్చే నెలలో జీతాల చెల్లింపులకు ఆటంకం తలెత్తకుండా ఈ చర్య తీసుకున్నట్టు చెబుతున్నారు.
నెలాఖరులో వెయ్యికిపైగా బిల్లులు
జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా 13 సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా ట్రెజరీ కార్యాలయానికి నిత్యం 500కు పైగా బిల్లులొస్తుంటాయి. నెలాఖరులో అయితే ఏకంగా వెయ్యికిపైగా ఉంటాయి. సబ్ ట్రెజరీ కార్యాలయాలకు నిత్యం 50 నుంచి 70 వరకు.. నెలాఖరులో 150 నుంచి 200 వరకు బిల్లులొస్తుంటాయి.
రోజువారీ చెల్లింపులకు ఇక్కట్లు
ట్రెజరీ ద్వారా వివిధ శాఖల రోజు వారీ ఖర్చులతో పాటు సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం నాలుగైదు కోట్లకు పైగా చెల్లింపులు జరుగుతుంటాయి. కారణాలు కూడా చెప్పకుండా 8 నుంచి ట్రెజరీ ద్వారా చెల్లింపులను అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పటికే బ్యాంకులకు పంపిన బిల్లులను కూడా పాస్ కాకుండా ఆన్‌లైన్‌లో లాక్ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల విలువే రూ.150 కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ట్రెజరీ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల విలువ మరో రూ.50 కోట్ల వరకు ఉంటుందంటున్నారు.
నిధులొచ్చినా.. మోక్షం లేదు
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలకు సంబంధించి జిల్లాకు ఇటీవలే నిధులొచ్చాయి. వీటి కోసం ఆయా విద్యాసంస్థలు ఎదురు చూస్తున్నాయి. తమకు రావాల్సిన ఫీజు బకాయిలకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్స్‌తో ట్రెజరీకి బిల్లులు పెట్టాయి. ఉపకార వేతనాలకు చెందిన బిల్లులు కూడా దాఖలయ్యాయి. ఈ నెల 8 నుంచి వీటిని నిలిపి వేశారు. ఈ విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కింద చెల్లించాల్సిన రూ.100 కోట్లకు పైగా చెల్లింపులు ఆగిపోయాయని చెబుతున్నారు. ఇతర బిల్లులకు సంబంధించి మరో రూ.50 కోట్ల వరకు చెల్లింపులకు బ్రేకులు పడ్డాయంటున్నారు.
జీతాలకు ఇబ్బంది లేకుండా..
శనివారం నుంచి జీతాలకు చెందిన బిల్లులు శాఖల వారీగా ట్రెజరీకి చేరుతున్నాయి. మార్చి 1న జీతాలు చెల్లించేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ఆంక్షలు మార్చి నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే నెల ఆర్థిక సంవత్సరం ముగింపు నెల కావడంతో జీతభత్యాల వరకు చెల్లింపులకు ఇబ్బంది లేకున్నప్పటికి మిగిలిన చెల్లింపులకు అనుమతి నిచ్చే అవకాశం లేదంటున్నారు. దీంతో ప్రభుత్వ శాఖలు రోజువారీ కార్యకలాపాల కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది.