
అంత ఈజీ కాదట!
► బొబ్బిలి ఎమ్మెల్యేకు మంత్రి పదవిపై టెన్షన్
► టీడీపీలో మారుతున్న సమీకరణాలు
► గట్టిగా పనిచేస్తున్న సుజయ వ్యతిరేక వర్గం
► ఓసీకి మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ తెరపైకి వాదన
► మృణాళినిని తప్పిస్తే బీసీలకు ఇవ్వాలని డిమాండ్
► వ్యూహాత్మకంగా మారిన బంగ్లా రాజకీయాలు
ఏ ఒప్పందంతో అయితే టీడీపీలోకి వెళ్లారో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణకు అది నెరవేరేలా కనిపించడం లేదట. అది అంత ఈజీ కాదని ఆ పార్టీ వర్గీయులే గుసగుసలాడుకుంటున్నారు. రోజురోజుకు సమీకరణాలు మారుతుండటంతో ఆయన ఇప్పుడు ఉత్కంఠకు లోనవుతున్నారు. మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందో లేదోనన్న అనుమానాలు కమ్ముకుంటున్నాయి. టీడీపీలో కొత్త గ్రూపులు తయారయ్యాయి. నిన్నటి వరకు కలిసి ఉన్న నాయకులు వైరి వర్గాలుగా విడిపోయారు. ఆయనపై వ్యతిరేక వర్గం ఎక్కువైంది. మృణాళినిని తప్పిస్తే మంత్రి పదవి మళ్లీ బీసీలకే ఇవ్వాలి! అదీ మహిళలకే ఇవ్వాలని కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రేసులోకి వచ్చారు. పవర్ సెంటర్ మారితే ఇబ్బందని అంతర్లీనంగా అశోక్ గజపతిరాజు కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ త్వరలో చేపడుతున్నట్టు సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. తన కుమారుడిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు విస్తరణ చేపడుతున్నారు. ఈ క్రమంలో మరికొందరికి చోటు కల్పిస్తారని, ఉన్న వారిలో కొందర్ని తప్పిస్తారని ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు వ్యవహారం చర్చకొచ్చింది. మంత్రి పదవి కోసం ఆశపడి పార్టీ మారారని, అందుకు తగ్గట్టుగా అదిష్టానం మాట ఇచ్చిందన్న వాదనల నేపథ్యంలో ఇప్పుడు ఆయన పరిస్థితిపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఆయనకంత సులువు కాదని, ఇస్తారన్న ధీమా కూడా లేదని టీడీపీలో ప్రస్తుతం చర్చ ఊపందుకుంది. అంతర్లీనంగా జరుగుతున్న పరిణామాలే దీనికి కారణం.
సీనియర్ల ఆవేదన
మంత్రి పదవి డిమాండ్‌తో పార్టీలో చేరారని, ఆయనకే పదవి ఇస్తే తామంతా ఏమైపోవాలని సీనియర్లుగా ఉన్న నేతలు కొందరు అంతర్గతంగా అక్కసు వెళ్లగక్కడం ప్రారంభించారు. సామాజిక వర్గాలను తెరపైకి తీసుకొచ్చి సుజయకృష్ణకు మంత్రి పదవి ఇస్తే ఇబ్బందులే అన్న వాదనను విన్పిస్తున్నారు. అంతేకాకుండా పార్టీకి పెద్ద దిక్కుగా భావిసున్న అశోక్ గజపతిరాజు బంగ్లా నుంచి పవర్ సెంటర్ మారిపోతుందన్న సెంటిమెంట్ తీసుకొచ్చారు. ఒకవేళ మృణాళినిని మంత్రి పదవి తప్పిస్తే ఆ స్థానంలో కాపులకు గాని, వెలమలకు గానీ అవకావం ఇవ్వాలే తప్ప కొత్తగా పార్టీలో చేరిన ఆయన్ను ఎలా తీసుకుంటారనే వాదన అదిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
ఓసీ వర్గానికి చెందిన ఆయనకు ఇవ్వడం వల్ల పార్టీకి మేలు జరగదని చెబుతున్నారట. వెలమ సామాజిక వర్గం నుంచైతే కోళ్ల లలితకుమారికి ఇవ్వాలని, కాపు సామాజిక వర్గం నుంచి ఎవరికిచ్చినా ఫర్వాలేదనే వాదనలు ఊపందుకున్నాయి. తెలంగాణలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ మారిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి పదవి ఎలా ఇచ్చారంటూ అక్కడ గగ్గోలు పెట్టిన నేతలు ఇక్కడెలా పార్టీ మారిన సుజయకృష్ణకు మంత్రి పదవి ఇస్తారని, ఒకవేళ ఇస్తే ప్రజలకు ఏం సమాధానం చెప్పగలమనే వాదనలను అంతర్గతంగా విన్పిస్తున్నారు. ఇవన్నీ సుజయకృష్ణకు ప్రతికూలంగానే తయారయ్యాయి.
పెరుగుతున్న అంతర్గత పోరు
జిల్లా టీడీపీలో తొలుత రెండు గ్రూపులుండేవి. మంత్రి మృణాళిని, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ద్వారపురెడ్డి జగదీష్ ఒక గ్రూపుగా ఉండగా, జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు కొండపల్లి అప్పలనాయుడు, మీసాల గీత మరో గ్రూపుగా ఉండేవారు. సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు అటూ ఇటుగా ఉన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు చేరికతో టీడీపీలో సమీకరణాలు మారిపోయాయి. జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి వర్గీయులు సుజయకృష్ణ వైపు రాగా, కోళ్ల, ద్వారపురెడ్డి, కొండపల్లి ఒక వర్గంగా తయారైనట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సుజయకృష్ణకు మంత్రి పదవి ఇస్తే పార్టీలో అంతర్గత పోరు ఎక్కువై, అసలుకు నష్టం వచ్చే అవకాశం ఉందనే సంకేతాలను అధిష్టానానికి పంపిస్తున్నారు. మరీ, వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం సుజయకు మొండి చేయి చూపిస్తుందో లేదంటే తొలుత ఇచ్చిన హామీ ప్రకారం కేబినెట్‌లోకి తీసుకుంటుందో చూడాలి.
పవర్‌సెంటర్ మారుతుందనేనా...
టీడీపీ ఆవిర్భావం నుంచి అశోక్ బంగ్లాయే చక్రం తిప్పుతోంది. అశోక్ గజపతిరాజే కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, పదవులు ఎవరికి ఇవ్వాలన్నా అశోక్ నిర్ణయమే శిరోధార్యం. దశాబ్ధాలుగా ఒకే కేంద్రంగా టీడీపీ రాజకీయాలు నడుస్తున్నాయి. వన్ మేన్ షో కొనసాగుతూ వస్తోంది. అశోక్‌ను కాదనే పరిస్థితి పార్టీలో ఎప్పుడూ లేదు. అయితే, తాజాగా జరుగుతున్న చర్చ ప్రకారం సుజయకృష్ణకు మంత్రి పదవి ఇస్తే పవర్ సెంటర్ మారుతుందనే భయం బంగ్లా నేతలకు పట్టుకుంది. బయటకు చెప్పుకోలేకపోతున్నా అంతర్గతంగా మదన పడుతూనే ఉన్నారు. బొబ్బిలి రాజులకు ఒకసారి అవకాశమిస్తే అశోక్ ప్రాబల్యం తగ్గుతుందని, అదే జరిగితే తమ పరిస్థితేంటన్న అభద్రతా భావం పట్టుకుంది. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.