'హాట్ హాట్గా తెలంగాణ అసెంబ్లీ'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభంకాగానే గందరగోళం నెలకొంది. వికారుద్దీన్ ఎన్ కౌంటర్ విషయంపై చర్చించాలని పేర్కొంటూ మజ్లిస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, ఈ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఎట్టి పరిస్థితిలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పట్టుబట్టారు. దీంతో తొలుత స్పీకర్ మధుసూదనాచారి ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలపైనే ప్రధానంగా చర్చించాలని బీఏసీలో నిర్ణయించడమైందని అన్నారు.
అప్పటికీ ఆయన వినకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని రైతుల ఆత్మహత్యలపైనే ప్రధాన చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు. రెండు రోజులపాటు ఈ చర్చ జరిగిన తర్వాతే వికారుద్దీన్ ఎన్ కౌంటర్ అంశంపై చర్చ జరుపుకుందామని చెప్పారు. మంత్రి హరీశ్ రావు కూడా సభకు సహకరించాలని కోరడంతో చివరకు అక్బరుద్దీన్ వెనక్కు తగ్గి రైతుల అంశంపై చర్చ ప్రారంభమైంది.