పదో తరగతి విద్యార్థి మృత్యువాత
-
ప్రాణం తీసిన ఈత సరదా
-
శోకసంద్రంలో కుటుంబసభ్యులు
జైపూర్ : ఈత సరదా ఆ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈతకు వెళ్లి లోతు తెలియక గొల్లవాగులో మునిగి పెద్దల మణికుమార్(15)అనే పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. జైపూర్ మండలం నర్సింగాపూర్(బి)లో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. జైపూర్ మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయితీ పరిధి నర్సింగాపూర్(బి)కి చెందిన పెద్దల బాపు–రూప దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు మణికుమార్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావడంతో అతడితో పాటు ఐదుగురు స్నేహితులు కలిసి ఈత కోసం సమీప గొల్లవాగు(రోషయ్యకుంట)కు వెళ్లారు. జూలై, ఆగస్టు మొదటివారంలో కురిసిన భారీ వర్షాలతో గొల్లవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో గొల్లవాగు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నర్సింగాపూర్ సమీపంలో గల గొల్లవాగుకు చేరాయి. దీంతో వాగులో నీరు ఎక్కువగా ఉంది. ఈత కోసం వచ్చిన మణికుమార్ అతని స్నేహితులు వాగులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడం గమనించకుండా అందులోకి దిగడంతో మణికుమార్ ఈత రాక అందులో మునిగిపోయాడు. తోటి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా అందులో ఎవరికీ సరిగా ఈత రాకపోవడంతో మణికుమార్ నీట మునిగి మృత్యువాతపడ్డాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదించారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదం అలుముకుంది. సంఘటన స్థలాన్ని స్థానిక ఎస్సై సంజీవ్ సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.