కాకరపర్రులో చోరీలు
Published Tue, Nov 8 2016 2:41 AM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM
కాకరపర్రు(పెరవలి) : పెరవలి మండలం కాకరపర్రులో ఆదివారం రాత్రి రెండుచోట్ల చోరీలు జరిగాయి. దీంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. పెరవలి ఎస్‌ఐ పి.నాగరాజు కథనం ప్రకారం.. కాకరపర్రు గ్రామానికి చెందిన వేండ్ర సక్కుబాయి ఆదివారం ఇంటికి తాళం వేసి కానూరు అగ్రహారంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. సోమవారం తిరిగి వచ్చింది. వచ్చేటప్పటికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బీరువా బద్దలుకొట్టి ఉంది. సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని రూ.పదివేలు, మూడుకాసుల బంగారం కనబడలేదు. అలాగే గ్రామంలోని పోలసానిపల్లి సత్తిబాబు ఇంట్లోనూ ఆదివారం రాత్రి దొంగలు పడి బీరువాలోని ఒక కాసు బంగారం, 20 వేల నగదు దోచుకుపోయారు. ఆ బీరువాలోని వెండివస్తువుల జోలికి మాత్రం దొంగలు వెళ్లలేదు. చోరీలు జరిగిన తీరును బట్టి తెలిసినవాళ్లే వీటికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్‌ఐ నాగరాజు ఘటనాస్థలాలను పరిశీలించారు.
Advertisement
Advertisement