నయవంచనపై నిరసన పథం | un employees fight on tdp government | Sakshi
Sakshi News home page

నయవంచనపై నిరసన పథం

Published Sun, Jan 8 2017 11:42 PM | Last Updated on Tue, Oct 2 2018 6:48 PM

un employees fight on tdp government

  • అందరికీ ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం
  • లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటన
  • ఇప్పటికీ అమలుకు నోచని ఆయన హామీలు
  • జిల్లాలో జాబ్‌ కోసం 80 వేల మంది నిరీక్షణ
  • మొక్కుబడి తంతుగా మారిన జాబ్‌మేళాలు
  • మోసాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ పోరుబాట
  • యువజన విభాగం ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద నేడు ‘ఉద్యోగ పోరు’
  • ఆర్భాటం ఎక్కువ.. అసలు తక్కువ అన్నట్టుగా ఉంది టీడీపీ ప్రభుత్వం తీరు. అధికారం పొందేందుకు అలవికాని హామీలిచ్చి.. తీరా అందలం ఎక్కాక.. వాటి ఊసే విస్మరించిందనడానికి ఉదాహరణలెన్నో. ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలిస్తామని, లేకుంటే ప్రతి నెలా రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామంటూ గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ అటువంటి కోవలోకే వస్తుంది. ఈ హామీలు అమలు చేయాలన్న డిమాండుతో వైఎస్సార్‌ సీపీ పోరుబాట పడుతోంది.  
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    గత ఎన్నికల సమయంలో గద్దెనెక్కేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎడాపెడా హామీలు గుప్పించేశారు. ఆయన ఇచ్చిన 600 పైచిలుకు హామీల్లో నిరుద్యోగం లేకుండా చేస్తానన్నది ప్రధానమైనది. ఉద్యోగం కల్పించలేని పక్షంలో నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి కూడా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీలు ఇప్పటివరకూ అమలుకు నోచకపోవడంతో జిల్లాలోని నిరుద్యోగులు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    ఇదీ నిరుద్యోగ సైన్యం
    కాకినాడలోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం లెక్కల ప్రకారం పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన 80 వేల మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాల వేటలో ఉన్నారు. పదో తరగతి అభ్యర్థులు 52 వేలు, టెక్నికల్‌ అభ్యర్థులు 16 వేలు, నా¯ŒS టెక్నికల్‌ 13 వేలమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగం కోసం నమోదు చేసుకుంటున్నవారి సంఖ్య ఏటేటా రెట్టింపవుతోంది. కానీ అందుకు తగ్గట్టు ఉద్యోగాలు పెరిగిన దాఖలాలు లేవు.
    ప్రభుత్వ శాఖల్లో 10 వేలకు పైగా ఖాళీలు
    మరోపక్క వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడంలేదు. జిల్లాలోని పంచాయతీ, రెవెన్యూ తదితర శాఖల్లో 30 వేల మంది ఉద్యోగులున్నారు. ఆయా శాఖలన్నీ కలిపి జిల్లా మొత్తంమీద 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఉపాధి కల్పనాధికారి ద్వారా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలి. కానీ ఆ ప్రక్రియ అసలు జరగడమే లేదు.
    జాబ్‌మేళాల ప్రహసనం
    శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం.. చిన్నచిన్న సంస్థల్లో ఉద్యోగుల నియామకానికి జాబ్‌మేళాల పేరుతో ప్రహసనం నడుపుతోంది. స్వయంగా జిల్లా అధికార యంత్రాంగమే నిర్వహిస్తున్న వికాస సంస్థ ద్వారా గడచిన రెండేళ్లలో 12 జాబ్‌మేళాలు నిర్వహించారు. వీటన్నింటికీ కలిపి సుమారు 60 వేల మంది హాజరైతే, 9 వేల మందికి మాత్రమే ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించగలిగారు. అవి కూడా నెలకు రూ.7 వేల నుంచి రూ.13 వేలకు మించి జీతం రాని ఉద్యోగాలే. దీనినిబట్టి మేళాలు నిర్వహించామని ఘనంగా చెప్పడమే తప్ప.. ఉద్యోగాలు పొందుతున్నవారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోంది. ఇటీవల రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌ సమక్షంలో నిర్వహించిన జాబ్‌మేళాదీ ఇదే పరిస్థితి. చాలా సందర్భాల్లో ఈ మేళాలకు వచ్చే కంపెనీలపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చి ఆ చిరుపోస్టులను కూడా ఎగరేసుకుపోతున్నారు.
    నిరుద్యోగ భృతి ఊసే లేదు
    ఉద్యోగాలు ఇవ్వకుంటే ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పటివరకూ 32 నెలలైంది. దీని ప్రకారం ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.2 వేల వంతున ఇప్పటివరకూ రూ.66 వేలు భృతిగా ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఆ ఊసే విస్మరించింది.
    నిరుద్యోగులకు బాసటగా..
    సర్కారు చేతిలో నయవంచనకు గురవుతున్న నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం నడుం బిగించింది. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగం లేదా భృతి ఇవ్వాలన్న డిమాండుతో ‘ఉద్యోగ పోరు’కు ఉద్యుక్తమవుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించనున్నారు. అనంతరం దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ  ‘ఉద్యోగ పోరు’ నిర్వహించే దిశగా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సిద్ధమవుతున్నారు.
     
    విజయవంతం చేయాలి
    ప్రభుత్వాన్ని మేల్కొల్పి నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకే ‘ఉద్యోగ పోరు’ నిర్వహిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులందరికీ చంద్రబాబు సర్కార్‌ నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈ పోరు నిర్వహిస్తున్నాం. యువత కోసం తలపెట్టిన ఈ పోరుకు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి. తద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించాలి.
    – అనంత ఉదయభాస్కర్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement