'కేటీఆర్‌కు దేవుడు సద్బుద్ధినివ్వాలి' | union minister dhrmendra pradhan takes on ktr | Sakshi
Sakshi News home page

'కేటీఆర్‌కు దేవుడు సద్బుద్ధినివ్వాలి'

Published Sat, Dec 26 2015 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

union minister dhrmendra pradhan takes on ktr

 హైదరాబాద్: బీజేపీ మద్దతుతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవిర్భావం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఆయనకు దేవుడు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాం’’ అని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ‘అహంకారపూరిత మాటలు మానుకుని ముందు మీ నాన్న కేసీఆర్‌ను సచివాలయానికి పిలిపించుకో’ అని కేటీఆర్‌నుద్దేశించి అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారైతే ప్రధాని మోదీని కలసి మాట్లాడుకోవాలని సూచించారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి 91వ జన్మదినం సందర్భంగా శుక్రవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో, హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.  దేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత వాజ్‌పేయిదన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలను ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తున్నాయన్నారు. హైదరాబాద్ త్వరలోనే వైఫై నగరంగా మారబోతోందని కేంద్ర మంత్రి, బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్‌ను దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి కేంద్రం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత వాజ్‌పేయిదేనని అన్నారు.

 మోదీపై మజ్లిస్ విమర్శలా: కిషన్‌రెడ్డి
 మోదీని విమర్శించే అర్హత మజ్లిస్‌కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. అది చట్టసభల్లో కాదు.. చంచల్‌గూడ జైల్లో ఉండాల్సిన పార్టీ అని అన్నారు. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు ఏమాత్రం బలం లేదని, ఫిరాయింపులతో బలపడేందుకు చూస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement