సంక్షేమ పథకాలు తాత్కాలికమే
కాలక్రమంలో వాటిని నిలిపివేస్తాం: చంద్రబాబు
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలను తాత్కాలికంగానే అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అవి స్వల్ప కాలానికి మాత్రమే ఊరటనిస్తాయని, ఒకసారి అభివృద్ధి దిశగా అడుగులు పడితే వాటిని నిలిపివేస్తామని అన్నారు. నవ నిర్మాణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ‘రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు-అభివృద్ధి’ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలపై ఆధారపడటమే కాకుండా ప్రతి కుటుంబం ఆర్థికంగా సొంతగా నిలబడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పారిశ్రామికవాడలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఇలావుండగా కృష్ణా జిల్లాలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించిన 8 సంక్షేమ హాస్టళ్లను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.
వర్సిటీలు నెలకొల్పండి
విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి స్మృతి ఇరానిని కోరారు. మంగళవారం నగరానికి వచ్చిన ఆమె కేంద్ర సహాయ మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌తో కలసి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన జాతీయ విద్యాసంస్థల గురించి ప్రస్తావించగా ఆమె స్పందిస్తూ అన్నివిధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, క్యాంపు కార్యాలయంలో మంగళవారం బాబుతో ఓఎన్‌జీసీ, గెయిల్ ప్రతినిధులు సమావేశమయ్యారు.