పని చేస్తున్న స్థలాల్లో గాలి సరఫరా సక్రమంగా లేదని అడిగిన కార్మికులను గని అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య పేర్కొన్నారు.
-
ఐఎన్‌టియూసీ ఏరియా ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య
మందమర్రి : పని చేస్తున్న స్థలాల్లో గాలి సరఫరా సక్రమంగా లేదని అడిగిన కార్మికులను గని అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య పేర్కొన్నారు. గురువారం స్థానిక కేకే–5 గని అవరణలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని ప్రదేశాల్లో గాలి అందక ఊపిరి తీసుకునేందుకు కష్టంగా మారిందని కార్మికులు ఉన్నతాధికారుల దష్టికి తీసుకువస్తే ప్రయోజనం లేకుండా పోతోందని కార్మికులు వాపోతున్నట్లు వారు తెలిపారు.
ఇదేంటని ప్రశ్నించిన కార్మికులను షిప్టులను మారుస్తూ వారిని మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. గాలి సరఫరా లేక ఇటీవల సింగరేణి వ్యాప్తం కార్మికులు మత్యువాత పడిన అధికారుల తీరులో మార్పులు రావడం లేదన్నారు. కార్మికుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఐఎన్‌టియూసీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వెంకటరమణ, సంగ బుచ్చయ్య, మేడ సమ్మయ్య, మడక శశిధర్, కంది శ్రీనివాస్, ఎం సదానందం తదితరులు పాల్గొన్నారు.