18 నుంచి ప్రపంచ వినియోగదారుల వారోత్సవాలు
Published Tue, Dec 13 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
–డీఎస్‌ఓ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ప్రపంచ వినియోగదారుల వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి(డీఎస్‌ఓ) శశిదేవి తెలిపారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ...ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురష్కరించుకుని హైస్కూల్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మీడియంలలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. హైస్కూల్ విద్యార్థులకు డీఈఓ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కేవీఆర్ కళాశాల ప్రిన్స్‌పాల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి మీడియంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయని, మొదటి స్థానంలో గెలిచిన వారికి రూ.3000, రెండో స్థానంలో గెలిచిన వారికి రూ.2000, తృతీయ స్థానంలో గెలుపొందిన వారికి రూ.1500 నగదు బహుమతులు ఇస్తున్నట్లు వివరించారు. అలాగే మొదటి స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు. వారోత్సవాల్లో భాగంగా 24న కర్నూలులో పెద్ద ఎత్తున ర్యాలీ, సునయన ఆడిటోరియంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement