అవినీతి కానిస్టేబుల్స్‌పై వేటు
Published Sat, Mar 11 2017 11:20 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌లపై వేటు పడింది. పలు ఆరోపణలు రావడంతో కానిస్టేబుల్ సురేష్, హెడ్ కానిస్టేబుల్ భూపాల్‌రెడ్డిలను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇరువురికి మట్కా, క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్‌లతో సంబంధాలు ఉన్నట్లు పలువురు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందాయని తెలిసింది.
ఇటీవల పట్టణంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని సురేష్, భూపాల్‌రెడ్డిలు డబ్బు ఇవ్వాలని తరచూ బెదిరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై కూడా అప్పట్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అంతేగాక ఓ మట్కా బీటర్‌తో సంబంధాలు పెట్టుకొని ఆర్థికంగా బాగా లబ్దిపొందినట్లు తెలుస్తోంది. పోలీసుల దాడుల నేపథ్యంలో మట్కా బీటర్‌కు వీరు ముందస్తు సమాచారం ఇచ్చేవారని విశ్వసనీయ సమాచారం.
ఫిర్యాదులను కొద్దిరోజులుగా పరీశిలిస్తున్న జిల్లా ఎస్పీ.. సురేష్, భూపాల్‌రెడ్డిలను వీఆర్‌కు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరువురు వెంటనే వీఆర్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని పోలీసు అధికారులు తెలిపారు. కాగా విచారణ అనంతరం రెండు లేదా మూడు రోజుల్లో తదుపరి చర్యలు కూడా ఉంటాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. వన్‌టౌన్ పీఎస్‌లో ఒకేసారి ఇద్దరిపై వేటు పడటంతో సిబ్బంది వెన్నులో వణుకుపుడుతోంది.
Advertisement
Advertisement