ఆ నలుగురిని మళ్లీ బరిలోకి దింపండి..
విజయవాడ: తెలుగుదేశం పార్టీలోకి వలస వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీచేసి గెలవలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ సీనియర్ నేత సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడుతూ.. గతంలో దానం నాగేందర్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు తెలుగుదేశం పార్టీ వీడి కాంగ్రెస్‌కు వచ్చినప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారి చేత పదవులకు రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో నిలబెట్టారని గుర్తుచేశారు.
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్నారని, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళితే వారు రాజీనామాలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేస్తారు. ఇక్కడ మాత్రం నలుగురు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించారా? అంటూ ప్రశ్నించారు. జలవనరుల ప్రాజెక్టుల్లో కుంభకోణం చేయగా వచ్చిన కోట్లాది రూపాయల సొమ్మును ఎరగా వేసి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చంద్రబాబు కొంటున్నారని ఆరోపించారు.
వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ను రాజీనామా చేయించి తిరిగి టీడీపీ తరపున పోటీ చేయించాలని కోరారు. జలీల్‌ఖాన్‌పై ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి చెందిన ఏడుగురు కార్పొరేటర్లలో మీ పార్టీ ఎవర్ని సూచించినా పోటీకి దింపి. పాతిక వేల మెజారిటీతో గెలిపించుకుంటామని సవాలు విసిరారు. చంద్రబాబు రాజధాని ప్రాంతాన్ని సింగపూర్‌గా మార్చుతానంటే ప్రజలు నమ్మారని, అయితే రాజకీయ వ్యభిచార కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఇప్పటికే తెలంగాణను కోల్పోయి రెండు కళ్లలో ఒక కన్ను పోగొట్టుకున్నారని, ఇప్పుడు రెండో కంట్లో నాలుగు యాసిడ్ చుక్కల్ని వేసుకుని ఆ కన్ను కూడా పోగొట్టుకునేందుకు సిద్ధమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి అన్నారు. ప్రజల్లో చంద్రబాబు గ్రాఫ్ రోజురోజుకు పడిపోతూ ఉండబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి ఇప్పుడు ఆకర్ష్ పథకం పెట్టి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు చేసే దుర్మార్గపు పనుల్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఆయన్న రాజకీయ సమాధి చేస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు.