లీకులకు ఆస్కారం లేకుండా, కాపీ రాయుళ్లకు అవకాశమీయకుండా పరీక్షలు నిర్వహించడం తమ వల్ల కాదని పరీక్షల నిర్వహణ బోర్డులు మన దేశంలో తరచు నిరూపించుకుంటున్నాయి. ఈ విషయంలో మిగిలిన బోర్డులకు ఏమాత్రం తీసి పోని కేంద్ర మాధ్యమిక విద్యామండలి(సీబీఎస్‌ఈ) ఈ పరీక్షల సీజన్‌లో లక్షలాది మంది విద్యార్థుల ముందు దోషిగా నిలబడింది. ఇతర బోర్డులతో పోలిస్తే సీబీ ఎస్‌ఈ నెత్తిన బృహత్తర బాధ్యతలున్నాయి. అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాత్రమే కాదు... విదేశాల్లో ఉంటున్న విద్యార్థులకు సైతం పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఈసారి పదో తరగతి పరీక్షలకు మొత్తం 16,38,428మంది విద్యార్థులు హాజరుకాగా, 12వ తరగతి పరీక్షలను 11,86,306మంది రాస్తున్నారు. మొత్తం అన్ని బోర్డులు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో సీబీఎస్‌ఈ వాటా 9 శాతం ఉంటుందని అంచనా. మూడేళ్లనుంచి సీబీఎస్‌ఈ అఖిల భారత వైద్య ప్రవేశ పరీక్ష(నీట్)ను కూడా నిర్వహిస్తున్నది. పదో తరగతి విద్యార్థులందరూ ఎంతో కష్ట మని భావించే పరీక్ష లెక్కలు. దాన్ని విజయవంతంగా ముగించుకుని పిల్లలందరూ హోటళ్లలో, రెస్టరెంట్లలో, చాయ్ దుకాణాల్లో అనుభవాలను కలబోసుకుంటుండగా బుధవారం మధ్యాహ్నం పరీక్ష రద్దయిన వార్త వెలువడి లక్షలమంది విద్యార్థులను దిగ్భ్రాంతిపరిచింది.
మిగిలిన పాఠ్యాంశాల్లో ప్రతిభను ప్రదర్శించే చాలామంది పిల్లలకు సైతం లెక్కలు ఓపట్టాన కొరుకుడు పడదు. వారి దృష్టిలో అది దాటక తప్పని మహాసాగరం. అలాంటి సంక్లిష్టమైన పాఠ్యాంశంలో మరో మూడు నెలల తర్వాత రెండోసారి పరీక్ష రాయకతప్పని స్థితి ఏర్పడింది. ‘అవసరమనుకుంటే’ లెక్కల పరీక్షను వచ్చే జూలైలో నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ చెబుతోంది. అయితే ఆ పరీక్షను ఢిల్లీ, హర్యానాలకే పరిమితం చేయాలా... లేక ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించాల్సి ఉంటుందా అన్నది బోర్డు ఇంకా తేల్చుకోలేదు. పరీక్షల బాదర బందీ అంతా పూర్తయ్యాక ఫలితాలొచ్చేలోగా సెలవుల్లో ఎటైనా వెళ్లి హాయిగా గడుపుదామనుకునే విద్యార్థులకు ఇదెంత నరకమో వేరే చెప్పనవసరం లేదు. 12వ తరగతి ఎకనమిక్స్ పాఠ్యాంశంలో ఏప్రిల్ 25న పరీక్ష ఉంటుందని బోర్డు ప్రక టించింది. ఆ తేదీలోగా నిర్వహిస్తే తప్ప యూనివర్సిటీ ప్రవేశాలకు విద్యార్థులు అర్హత కోల్పోతారు.
ప్రశ్నపత్రాలు ఎలా లీకయ్యాయో, ఎక్కడ లీకయ్యాయో 48 గంటలు గడు స్తున్నా బోర్డు పెద్దలకు బోధపడలేదు. అర్థరాత్రి లీకు సంగతి తెలిశాక తనకు నిద్రపట్టలేదని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవడేకర్ బాధపడ్డారు. ఆయన బాధపడటంలో అర్ధం ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో సీబీఎస్‌ఈ మాత్రమే కాదు... ఆయన శాఖ కూడా బోనెక్కాల్సి ఉంటుంది. తమ వైఫల్యాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. కానీ ఏ నేరమూ చేయని పిల్లలు, వారి తల్లిదండ్రులు పడే బాధ వర్ణానాతీతం. తమ తప్పేమీ లేకుండానే వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణ కోసం నాలుగు దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న విధానాలను నిరుడు బోర్డు పక్కనబెట్టింది.
గతంలోనూ కొన్ని పర్యాయాలు పరీక్ష పత్రాలు లీకయ్యాయి. కానీ పాత విధానంలో ఏ ప్రశ్నపత్రం లీకయిందో చూసుకుని అది వెళ్లిన కేంద్రాల్లోని విద్యార్థులకు మాత్రమే తిరిగి పరీక్ష నిర్వహిస్తే సరిపోయేది. ఇప్పుడు కూడా ఢిల్లీ, హర్యానాల్లో మరోసారి పరీక్ష పెడితే సరిపోతుందని బోర్డు చెబుతోందిగానీ అదెంతవరకూ సబబైన నిర్ణయమో చెప్పలేం. పాత విధానంలో మూడు రకాల ప్రశ్నపత్రాలు రూపొందేవి. అందులో ఒకటి ఢిల్లీ ప్రాంతానికి, మరొకటి దేశంలోని ఇతర ప్రాంతాలకూ, మూడో రకం ప్రశ్నపత్రం విదేశాల్లో పరీక్ష రాసే విద్యార్థుల కోసం తయారుచేసేవారు. వీటిలో కేవలం 30 శాతం ప్రశ్నలు మాత్రమే ఉమ్మడిగా ఉంటాయి. మిగిలిన 70శాతం ప్రశ్నలూ వేర్వేరుగా ఉంటాయి. మళ్లీ ప్రతి సెట్‌లోనూ మూడు సబ్–సెట్‌లు, అన్నిటిలోనూ వేర్వేరు ప్రశ్నలక్రమం ఈ విధానంలోని విశిష్టత. దీనికి సీబీఎస్‌ఈ నిరుడు స్వస్తి పలికింది.
ఒకే రకమైన ప్రశ్నల సెట్ రూపొందించి ఆ ప్రశ్నల క్రమం మాత్రం వేర్వేరు ప్రాంతాలకు వేర్వే రుగా ఉండేలా తయారుచేసింది. కనుకనే ఇప్పుడు లీకైన ప్రాంతంలో మాత్రమే కాక... అన్నిచోట్లా పరీక్షలు నిర్వహించక తప్పకపోవచ్చునన్న వాదన వినిపిస్తోంది. అసలు ప్రశ్నపత్రాలు లీకైన తీరే వింతగా ఉంది. 28న అర్థరాత్రి ఒంటిగంటన్నర దాటాక సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్ మెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తి మూడు మెయిల్స్ పంపాడు. అందులో చేతిరాతతో ఉన్న 12 అటాచ్‌మెంట్లు ఉన్నాయి. అవన్నీ లెక్కల ప్రశ్నపత్రానివే. వాట్సాప్ గ్రూపుల్లో ఇవి చక్కర్లు కొడుతున్నట్టు అతడు వెల్లడించాడు.
ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షలకెళ్లే పిల్లల కోసం తానే స్వయంగా రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని గత నెల్లో విడుదల చేశారు. పరీక్షలంటే కంగారు పడాల్సిన అవసరం లేదని, వాటిని పండగలా భావించాలని అందులో ఉద్బో ధించారు. కానీ పిల్లల పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపకరించాల్సిన పరీక్షలు సారాంశంలో వారి జ్ఞాపకశక్తిని మాత్రమే మదింపు వేస్తున్నాయి. బట్టీపట్టడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సృజనాత్మకత చోటీయడంలేదు. కనీసం ఏడెనిమిది నెలలు రాత్రింబగళ్లు కష్టపడితే తప్ప ఫలితమీయని పరీక్షల్ని పిల్లలు పండగలా ఎలా భావించగలుగుతారు?
పరీక్షల్లో ఒక్క మార్కు తగ్గితే గ్రేడ్ గల్లంతవుతుంది. ఇత రుల కంటే గ్రేడ్ బాగుంటేనే ‘మెరుగైనచోట’ చదవడం సాధ్యమవుతుంది. ఈ లీకుల పర్యవసానంగా కొందరు అయాచితంగా అందలాలెక్కుతుంటే ఏటికేడాదీ కష్టపడినా చాలామంది నాసిరకం గ్రేడ్లతో సరిపెట్టుకుంటున్నారు. ఇకపై సీబీ ఎస్‌ఈ, ఏఐసీటీఈ వగైరా బోర్డుల పరీక్షలన్నిటి నిర్వహణకూ జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) రంగంలోకి రాబోతోంది. మరి దాని తీరెలా ఉంటుందో చూడాలి. ఇప్పు డనుసరిస్తున్న విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థుల్లో నిపుణత, మేధో సంపత్తి, సంక్లి ష్టతలను అధిగమించే శక్తి వగైరాలెలా ఉన్నాయో మదింపు వేసే పరీక్షా విధానం అమల్లోకొస్తేనే ఎంతో కొంత ప్రయోజనకరం.
Comments
Please login to add a commentAdd a comment