చంపుడు పందెం! | ISIS cruel murder | Sakshi
Sakshi News home page

చంపుడు పందెం!

Published Fri, Feb 6 2015 12:20 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

ISIS cruel murder

గత కొన్నేళ్లుగా అత్యంత అమానుషమైన, హృదయవిదారకమైన ఉదంతాలు చోటు చేసుకుంటున్న పశ్చిమాసియాలో ఉన్మాదానికి పరాకాష్ట అనదగ్గ మరో ఘటన జరిగింది. డిసెంబర్ నెలలో తమకు బందీగా చిక్కిన జోర్డాన్ పైలట్‌ను ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు పంజరంలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రాణాలు తీశారు. ఆ ఉదంతం మొత్తాన్ని వీడియో తీసి సైబర్ ప్రపంచంలో ఉంచారు. 22 నిమిషాల ఆ వీడియో సభ్య సమాజాన్ని దిగ్భ్రమ పరిచింది. 2003లో అమెరికా ఇరాక్‌ను దురాక్రమించాక ఆ ప్రాంతంలో సాగుతున్న దురంతాల పరంపరకు తాజా ఘటన కొనసాగింపు. లండన్‌లో గత నెల 22న అమెరికా ఆధ్వర్యంలో జరిగిన 21 దేశాల సమావేశం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అణచడంలో తాము గణనీయంగా విజయం సాధించామని చెప్పుకుంది. అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీ అందుకు సంబంధించిన లెక్కలను కూడా వెల్లడించారు. ఇప్పటికి 6,000మంది జిహాదీలను హతమార్చగా... ఉగ్రవాదుల అధీనంలో ఉన్న ఇరాక్ భూభాగంలోని 700 చదరపు కిలోమీటర్ల ప్రాంతం వెనక్కి తీసుకోగలిమన్నారు. అయితే, ఉగ్రవాదుల చెరలో ఉన్న భూభాగంతో పోలిస్తే ఇది అత్యల్పం. అటు ఇరాక్‌లోనూ, ఇటు సిరియాలోనూ ఆ ఉగ్రవాదులు మూడో వంతు భూభాగాన్ని గుప్పిట బంధించి ఉంచుకున్నారు. ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాల ఆధ్వర్యంలోని భూభాగంకంటే ఉగ్రవాదుల చెరలో ఉన్న ప్రాంతమే పెద్దది! సిరియాలో బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చడానికి తామిచ్చిన ఆయుధాలతో, డబ్బుతో బలం పెంచుకుంటూ పోతున్న ఐఎస్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించేసరికే కాలాతీతమైంది. ఆ తర్వాత సంకీర్ణ కూటమి సైన్యాలు ఆ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఇంతవరకూ 1,800కు పైగా వైమానిక దాడులు చేశాయి. ఇందుకు దాదాపు 120 కోట్ల డాలర్లు వెచ్చించాయి. కానీ, ఇవి ఏమాత్రం ఫలితమివ్వలేదని అమెరికా విదేశాంగ మంత్రి వెల్లడించిన ‘విజయాలు’ చూస్తే అర్థమవుతుంది. నిజానికి ఆ విజయాలైనా అటు ఇరాన్, ఇటు సౌదీ అరేబియా సహకారం లేకపోతే సాధ్యమయ్యేవి కాదు.  ఆ ప్రకటన చేసిన కొన్ని రోజులకే జోర్డాన్ పైలట్ అనూహ్యంగా ఉగ్రవాదులకు పట్టుబడ్డాడు. కెర్రీ ప్రకటనకు బదులన్నట్టు ఉగ్రవాదులు కనీ వినీ ఎరుగని క్రూరత్వాన్ని ప్రదర్శించి అతన్ని పొట్టన బెట్టుకున్నారు.
 
 పటిష్టమైన వ్యూహం లేకుండా, లక్ష్యంపై అవగాహన లేకుండా, ఐఎస్ ఉగ్ర వాదుల నుంచి ఎదురుకాగల సవాళ్లపై అంచనా లేకుండా సంకీర్ణ కూటమి సేనలు సాగిస్తున్న దాడులవల్ల వీసమెత్తు ఫలితం ఉండటం లేదని ఇప్పటికే స్పష్టమైనా దాన్ని బహిరంగంగా ఒప్పుకుని సరిదిద్దుకోవడానికి అమెరికా ముందుకు రావడం లేదు. ఇరాక్, సిరియా, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, సోమాలియా, యెమెన్, మాలి, లిబియా తదితర దేశాల్లో ముస్లింలపై దాడులు సాగిస్తున్న పాశ్చాత్యులనుంచి కాపాడటం తనవల్లనే సాధ్యమని ఐఎస్ చెప్పుకుంటున్నది. ద్రోన్‌ల ద్వారా, యుద్ధ విమానాల ద్వారా సాగిస్తున్న బాంబు దాడులు కొంతమంది ఉగ్రవాద నేతలను హతమార్చిన మాట వాస్తవమే అయినా...ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నవారిలో అత్యధికులు సాధారణ పౌరులేనని మర్చిపోకూడదు. ఇదే ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నది. ఈ సంకీర్ణ కూటమిలో చేరినందుకు జోర్డాన్‌పై ఐఎస్ ఉగ్రవాదులు చాన్నాళ్లుగా నిప్పులు కక్కుతున్నారు. అదును కోసం ఎదురుచూస్తున్నారు. తమ అధీనంలో ఉన్న జపాన్ బందీలను విడిపించడానికి డబ్బు డిమాండు చేసిన ఉగ్రవాదులు జోర్డాన్ విషయంలో మాత్రం 2005 అమ్మాన్ పేలుళ్ల ఘటనలో చిక్కి జోర్డాన్ జైల్లో ఉన్న మహిళా ఉగ్రవాదిని విడుదల చేయాలని డిమాండు చేయడం అందులో భాగమే. భిన్న జాతుల కూటమిగా సాగుతున్న జోర్డాన్ ప్రభుత్వంలో విభేదాలు పెంచడానికి ఈ ఘటన తోడ్పడుతుందన్నది వారి భావన. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన పైలట్ తండ్రి కూడా జోర్డాన్‌లోని బలమైన ఒక తెగకు నాయకుడు. తన కుమారుడు ప్రాణాలతో తిరిగి రాకపోతే దేశం సంక్షోభంలో పడటం ఖాయమని ఆయన హెచ్చరించాకే జోర్డాన్ రాజు కదిలారు. అయితే అప్పటికే జాప్యం జరగడంతో ఉగ్రవాదులు పైలట్ ప్రాణాలు తీశారు.
 
 పశ్చిమాసియాలో ఇప్పుడు సాగుతున్నది చంపుడు పందెం. ఒకర్ని చూసి మరొకరు క్రౌర్యాన్ని, ఉన్మాదాన్ని పెంచుకుంటూ పోతున్నారు. 2003లో రసాయన ఆయుధాలున్నాయన్న నెపంతో సంకీర్ణ సేనలు ఇరాక్‌ను వల్లకాడు చేశాక అక్కడ ఉగ్ర వాదం వేళ్లూనుకుంది. తమ దేశంపై దాడిచేసిన అల్ కాయిదాను అంతం చేద్దామని... సిరియాలో తమకు అనుకూలంగా ఉండే నేతను ప్రతిష్టిద్దామని అమెరికా వేసిన ఎత్తుగడలే ఈ మొత్తం సంక్షోభానికి మూలకారణం. ఇందుకోసమని ఆ ముఠాకు ప్రత్యర్థులుగా ఉన్నవారిని పెంచి పోషించిన పర్యసానంగానే ఐఎస్ ఆవిర్భవించింది.
  పైలట్ హత్యపై వీడియో విడుదల కాగానే ‘భూమి బద్దలయ్యేంత స్థాయిలో ప్రతీకారం ఉంటుంద’ని జోర్డాన్ రాజు ప్రకటించారు. తీరా ఆయన ప్రభుత్వం చేసిందేమంటే పదేళ్లుగా తమ చెరలో ఉన్న ఇద్దరు మహిళా ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు జరపడం! ఈ వరస ఇకపైనా కొనసాగుతుందని సర్కారు చెబుతున్నది. ప్రైవేటు గ్రూపులైనా, ప్రభుత్వాలైనా సాగించే హింస అంతిమంగా సమాజాన్ని బండ బారుస్తుంది. సమస్య ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో గుర్తించడం సాధ్యం కానంతగా పరిస్థితిని దిగజారుస్తుంది. నాలుగేళ్లక్రితం పశ్చిమాసియాను ఊగించి శాసించిన ప్రజాస్వామిక ఉద్యమాలు మళీ ్ల అక్కడ పురుడు పోసుకుంటే తప్ప ఈ ఉన్మాదం విరగడ కాదు. ఉగ్రవాదులు ఎటూ వినే స్థితిలో లేరు. ప్రజాస్వామిక వాదులమని చెప్పుకునే పాశ్చాత్యదేశాలైనా కాస్తంత ఇంగితజ్ఞానాన్ని ప్రదర్శించాలి. సంక్షోభ ప్రాంతాల్లోని సాధారణ పౌరుల విశ్వాసాన్ని చూరగొనే చర్యలు ప్రారంభించాలి. లేనట్టయితే ఇవాళ ఇరాక్, సిరియాలను చుట్టుముట్టిన రాక్షసత్వమే రేపు ప్రపంచానికి సైతం ముప్పుగా పరిణమిస్తుంది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement