రంగంలోకి ‘ప్రాణదాతలు’ | Sakshi Editorial On 104 And 108 Ambulance Services | Sakshi
Sakshi News home page

రంగంలోకి ‘ప్రాణదాతలు’

Published Thu, Jul 2 2020 1:19 AM | Last Updated on Thu, Jul 2 2020 1:19 AM

Sakshi Editorial On 104 And 108 Ambulance Services

సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ సమర్థవంతమైన పాలన అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అపర సంజీవనులుగా కీర్తి ప్రతిష్టలు పొందిన 108, 104 అంబులెన్సులను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది బుధవారం ప్రారంభించారు. మొత్తం 1,088 వాహనాలు ఒకే రోజు తమ తమ గమ్యస్థానాలకు ‘కుయ్‌...కుయ్‌’మంటూ వెళ్లాయి. ఈ రెండు అంబులెన్సులూ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానసపుత్రికలు. వీటికి విశిష్ట చరిత్ర వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జన సంక్షేమానికి వైఎస్‌ రూపొందించిన పథకాల పరంపరలో ఇవి కూడా భాగం. వైద్యుడిగా పేద రోగులకు నామమాత్రపు ఫీజుతో చికిత్సనందించిన అను భవంతో ఈ అత్యవసర సేవలను ఆయన అందుబాటులోకి తెచ్చారు.

అప్పట్లో 70 అంబు లెన్సులతో, 50 పట్టణాల్లో ప్రారంభించిన ఈ సేవలు అచిరకాలంలోనే రాష్ట్రమంతటా విస్తరించి ఆపత్సమయాల్లో లక్షలాదిమందికి ప్రాణదానం చేశాయి. ఈ సేవలు సక్రమంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షించడం కోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా వైఎస్‌ ఏర్పాటు చేశారు. అప్పట్లో జాతీయ ఆరోగ్య మిషన్‌ 108 సిబ్బంది అందించిన సేవలను అధ్యయనం చేసి ప్రశంసల వర్షం కురిపించింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాలనుంచి ప్రతినిధి బృందాలు తరలివచ్చాయి. ఈ నమూనానే స్వీకరించి తమ తమ రాష్ట్రాల్లో అంబులెన్సు సర్వీసులు ప్రారంభించాయి. దురదృష్టమేమంటే ఆయన కనుమరు గయ్యాక అధికారంలోకొచ్చినవారు ఈ సేవలను నిర్వీర్యం చేశారు. నామమాత్రంగా మిగిల్చారు. సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించక, ఆ వాహనలకు అవసరమైన మరమ్మతులు చేయించక, కనీసం డీజిల్‌ కూడా ఇవ్వక భ్రష్టుపట్టించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కొచ్చిన చంద్రబాబు అన్నిటితోపాటు ఈ సర్వీసులను కూడా విస్మరించారు. ఇందుకు భిన్నంగా జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కీలకమైన ఈ అంబులెన్సు సర్వీసులపై దృష్టి కేంద్రీకరించారు. వాటి రూపురేఖల్ని సమూలంగా మార్చి అవి మరింత మెరుగైన సేవలం దించేందుకు అవసరమైన సౌకర్యాలన్నీ వాటిల్లో పొందుపరిచేలా చేశారు.   అన్నివిధాలా ఆరోగ్యవంతంగా వుండే పౌరులే ఏ దేశానికైనా నిజమైన సంపద అని బ్రిటన్‌ ప్రధానిగా పనిచేసిన విన్‌స్టన్‌ చర్చిల్‌ ఒక సందర్భంలో అన్నారు. కీలకమైన ఈ అంశాన్ని ప్రభు త్వాలన్నీ విస్మరిస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో వుండే పౌరులు ఉత్పాదకతలో పాలుపంచు కుంటారు. అక్కడ సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అవి రెండూ అంతిమంగా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. అలాంటి పౌరులుండే సమాజం సుఖసంతోషాలతో వుంటుంది. కానీ ఎవరికీ ఇది పట్టలేదు.

చంద్రబాబు తొలిసారి తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వాసుపత్రులు అందించే నాసిరకం సేవలకు సైతం యూజర్‌ చార్జీలు పెట్టి జనాన్ని వేధించుకుతిన్నారు. రెండోసారి అధికారంలోకొచ్చిన తర్వాత కూడా ప్రజారోగ్యాన్ని అటకెక్కించారు. ప్రభుత్వాసుపత్రులను చికిత్సాలయాలుగా కాక... రోగిష్టి కేంద్రాలుగా దిగజార్చారు. అంబులెన్సు సర్వీసుల గురించి చెప్పనవసరం లేదు. చంద్రబాబు వాటిని నామమాత్రం చేశారు. ఆ వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సరైన జీతాలుండేవి కాదు. అవి కూడా సకాలంలో వచ్చేవి కాదు. అంబులెన్సుల్లో అధిక భాగం ఎప్పుడూ షెడ్లలో పడివుండేవి. కను కనే నిరుపేద వర్గాలు, దిగువ మధ్యతరగతి వర్గాలు ఆయన పాలనలో విలవిలలాడాయి. ఆంధ్ర ప్రదేశ్‌ పౌరులకు ఇక ఆ చింత లేదు. ఇప్పుడు రూపొందించిన సర్వీసుల్లో అమరివున్న అత్యాధునిక సదుపాయాలు ఆపదలో చిక్కుకున్నవారికి అన్నివిధాలా తోడ్పాటునందిస్తాయి.

ఇంతక్రితం జనా భాలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్సు వుంటే, తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్సు అందుబాటులో వుండబోతోంది. అలాగే లోగడ ఏటా 6,33,600 మందికి సేవలందించే అంబులెన్సులు ఇకపై ఆ సేవల్ని ఏటా 12 లక్షలమందికి అందిస్తాయి. అనారోగ్యానికో, అనుకోని ప్రమాదానికో లోనయినవారిని ఆసుపత్రు లకు చేర్చేలోగానే మెరుగైన సేవలందించి ప్రాణాపాయస్థితినుంచి కాపాడటానికి కావలసిన అత్యా ధునిక ఉపకరణాలు అంబులెన్సుల్లో ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌ చేసిన 15 నిమి షాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో 25 నిమిషాల్లో అంబు లెన్సులు చేరతాయి. కనుక మారుమూల ప్రాంతాల్లో వున్నవారికి సైతం సకాలంలో వైద్య సేవలు అందుతాయి. ఇప్పుడున్న 108 అంబులెన్సులు 336తోపాటు కొత్తగా మరో 412 రంగంలోకి దిగబోతున్నాయి.

108, 104 సర్వీసులు ప్రతి మండలానికీ ఒక్కొక్కటి చొప్పున వుండేలా చూడటం, చిన్నారుల కోసం ప్రత్యేకించి 26 నియోనేటల్‌ అంబులెన్సులు అందుబాటులో వుంచడం జగన్‌ మోహన్‌రెడ్డికి పేద ప్రజల ఆరోగ్యంపై వున్న శ్రద్ధాసక్తులను తెలియజేస్తుంది. మృత్యుముఖంలో వున్న మార్కండేయుడు స్మరించిన మరుక్షణమే అతడిని కాపాడిన ముక్కంటి వైనం పురాణాల్లో చదివాం. ఇప్పుడు జగన్‌ చేతుల్లో పునరుజ్జీవం పొందిన ఈ అంబులెన్సులు కూడా అటువంటి పాత్రే నిర్వహించబోతున్నాయి. సాధారణ సమయాల్లో అందరూ నాయకుల్లానే చలా మణి అవుతారు. సంక్షోభాలే అలాంటివారిలో సమర్థులెవరో, కానివారెవరో నిగ్గుదేలుస్తాయి. కరోనా వైరస్‌ సంక్షోభం చుట్టుముట్టాక దేశంలో ఏ రాష్ట్రమూ చేయనివిధంగా లక్షల్లో వైద్య పరీక్షలు నిర్వ హించడం, అవసరమైన వారిని చికిత్సకు తరలించడం, వారు త్వరగా కోలుకొనేలా పౌష్టికాహారాన్ని అందించడంవంటి చర్యలు అమల్లోపెట్టి జగన్‌ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపారు. ప్రజారోగ్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. బుధవారం సరికొత్తగా మొదలైన ఈ అంబులెన్సు సర్వీసులు వాటికి కొనసాగింపే. ఇవి మళ్లీ ప్రాణదాతలుగా, ఆపద్బాంధవుల్లా అందరి ప్రశంసలూ పొందుతాయని ఆశించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement