మెట్టలో ప్రతి ఎకరాకు సాగునీరు
జగ్గంపేట/గోకవరం, న్యూస్‌లైన్ :వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్టలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు ఇస్తామని పార్టీ సీజీసీ సభ్యుడు, జగ్గంపేట అసెంబ్లీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని గోకవరం ఆంజనేయస్వామి గుడి సెంటర్‌లో సోమవారం రాత్రి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర్వహించిన జనభేరి కార్యక్రమంలో జ్యోతుల ప్రసంగించారు. గోకవరం మండలంతో పాటు నియోజకవర్గంలోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనంతో ప్రధాన రహదారి సుమారు అర కిలోమీటరు మేర కిక్కిరిసింది. ఈ సందర్భంగా జనాన్ని ఉద్ధేశించి జ్యోతుల ప్రసంగించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గంలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు ముఖ్యమైన పనులను చేపడతానన్నారు.
సాగునీటి సమస్య పరిష్కారంతో పాటు, విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం విశ్వవిద్యాలయం, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి నిర్మాణం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతానన్నారు. ఏలేరును పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామన్నారు. జగ్గంపేటలో 144 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తానన్నారు. ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనతో పాటు కాకినాడ పార్లమెంటు అభ్యర్థి సునీల్‌ను గెలిపించాలన్నారు. వైఎస్సార్ ఆలోచ నలు కలిగి ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు మనసారా కోరుకుంటున్నారని, వైఎస్ చేపట్టిన పనులను పూర్తి చేసే అవకాశం జగన్‌కే సాధ్యమన్నారు. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తూ అధికారం కోసం ప్రజలను మభ్యమట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అప్పట్లో సీఎంగా ఉండగా తాను, మరికొందరు ఎమ్మెల్యేలు కలిసి రైతుల అప్పులు మాఫీ చేయమంటే మైండ్ సెట్ మార్చుకోమని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారన్నారు. అయితే లక్షా 20 వేల కోట్ల రైతుల రుణాలను ఎలా మాఫీ చేస్తారని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలన్న చంద్రబాబు నేడు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని ఏ విధంగా అంటున్నారని ప్రశ్నించారు. ప్రపంచ దేశాల మన్ననలు పొందాలనే స్వార్థంతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెబుతున్నాడని, ఇప్పుడు అదే హైదరాబాద్ రాష్ట్ర విభజనకు కారణమయిందన్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమన్నారు. ఎన్నికలకు ఎంతో గడువు లేదని ఈ 15 రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక శక్తిగా మారి పార్టీని గెలిపించాలన్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, స్వర్ణయుగం రావాలన్నా జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి జ్యోతుల నవీన్, పార్టీ గోకవరం మండల కన్వీనర్ మంగరౌతు రామకృష్ణ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గాజింగం సత్తిబాబు, గోకవరం సొసైటీ అధ్యక్షుడు దాసరి తమ్మన్నదొర, సీనియర్ నాయకులు వరసాల ప్రసాద్, జనపరెడ్డి బాబు, సుంకర వెంకటరమణ, దాసరి దత్తుడు, జిల్లా యూత్ కమిటీ సభ్యుడు దాసరి రమేష్, గోకవరం జెడ్పీటీసీ అభ్యర్థి పాలూరి బోసు, సాలపు నలమహారాజు, ముమ్మన అర్జునరావు, ఇడుదుల అర్జునరావు, మోపర్తి వెంకటకృష్ణారావు, ఆదిరెడ్డి ముత్యం, జగ్గంపేట నాయకులు మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జగ్గంపేట సర్పంచ్ కొలిపే ప్రసన్నరాణి, అత్తులూరి నాగబాబు, సాయిబాబు, బస్వా వీరబాబు తదితరులు పాల్గొన్నారు.