అడకత్తెరలో అల్లు అర్జున్!
'డబుల్ ధమాకా'తో యమ హుషారుగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు ఎన్నికల సమరం సంకట స్థితిలోకి నెట్టింది. కొడుకు పుట్టిన ఆనందం, రేసు గుర్రం సినిమా విజయంతో జోరుమీదున్న బన్నీకి ఎన్నికలు సందిగావస్థ కలిగించాయి. ముగ్గురు మామల్లో ఎవరికి మద్దతు తెలపాలో తెలియక బన్నీ సతమవుతున్నాడు(ట). ఒకవైపు పిల్లనిచ్చిన మామ, మరోవైపు రక్తం పంచిన మేనమామలు ఉండడంతో ఎవరి పక్కనే నిలబడాలో తేల్చుకోలేకపోతున్నాడట అల్లువారి వారసుడు.
అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ శేఖర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సీటు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అటు పెద్ద మేనమామ చిరంజీవి సీమాంధ్రలో కాంగ్రెస్ తరపున ప్రచార బాధ్యతలు తలకెత్తుకున్నారు. ఇక చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన పార్టీ పెట్టి నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించారు. ముగ్గురిలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక బన్నీ సతమవుతున్నాడట. పిల్లనిచ్చిన మామకు ప్రచారం చేయాలా, మేనమామల పక్షానా నిలబడాలా అనేది తేల్చుకోలేకపోతున్నాడు. దీంతో అల్లు అర్జున్ పరిస్థితి అడకత్తెర పోక చెక్కలా తయారయింది.
మామకు ప్రచారం చేసే విషయంపై బన్నీ ఇప్పటివరకు నోరు విప్పలేదు. మేనమామలకు మద్దతు ఇచ్చే విషయంపై కూడా బన్నీ సూటిగా స్పందించలేదు. పవన్ అంటే ఇష్టం, చిరంజీవి అంటే ప్రాణమని మాత్రమే చెప్పాడు కానీ మద్దతుపై మాట్లాడలేదు. చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై ఇప్పటివరకు స్పందించలేదు. రేసుగుర్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంగీకరించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుంది. ఈలోపు జరగనున్న ఎన్నికల్లో బన్నీ ఏవిధంగా ముందుకు వెళతాడనే దాని గురించి అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.