‘ఫ్యాన్’గాలి | Analysts estimate that the voting conditions | Sakshi
Sakshi News home page

‘ఫ్యాన్’గాలి

Published Tue, Apr 1 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

Analysts estimate that the voting conditions

సాక్షి, ఒంగోలు: మున్సిపల్ ఎన్నికల్లో ‘ఫ్యాన్’ గాలి బలంగా వీచినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో అద్దంకి, చీరాల, మార్కాపురం, కనిగిరి, చీమకుర్తి, గిద్దలూరు మున్సిపాలిటీల్లో ఆదివారం జరిగిన ఓటింగ్ సరళి ప్రకారం  కచ్చితంగా ఆరు మున్సిపాలిటీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. మున్సిపల్ ఫలితాలపై ఆది నుంచి లెక్కలేస్తున్న అంచనాలే నిజమవుతాయని భావిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌పక్షాలకు ఈ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్‌నివ్వనున్నట్లు మెజార్టీ అభిప్రాయం వెల్లడవుతోంది. అధికారికంగా నమోదైన పోలింగ్ శాతాల వివరాల్ని పరిశీలిస్తే..

 విశ్లేషకుల అభిప్రాయాలకు మరింత బలం   చేకూరుతోంది. జిల్లా ఎన్నికల చరిత్రలో నమోదుకాని అత్యధిక పోలింగ్ శాతం ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనిపించడాన్ని ఒక ‘ప్రత్యేక’ పరిస్థితిగా అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ప్రస్తుతం చీమకుర్తి మున్సిపాలిటీలో అత్యధికంగా 85.98 శాతం పోలింగ్ నమోదైంది. అద్దంకి నగర పంచాయతీలో కూడా 85.55 శాతానికి మించి పోలింగ్  జరగడం విశేషం.

 విజయానికి కీలకంగా మహిళా ఓటింగ్..  
 జిల్లావ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ముందు మున్సిపల్ పోరుపై ప్రారంభం నుంచే తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అభ్యర్థుల ఖరారు నుంచి నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్ రోజు వరకు జిల్లావ్యాప్తంగా ఇదే చర్చ జరిగింది. ఈక్రమంలో పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్ల క్యూలు బారులు తీరడం, అందులోనూ మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌కు హాజరవడం విశ్లేషకుల్ని ఆశ్చర్యపరిచింది. ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,12,179 ఓట్లకు గాను 1,70,066 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళా ఓటింగ్ 91,486 పోలయ్యింది. అంటే 84.39 శాతం మహిళా ఓటింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలు, వృద్ధులు తమ ఓటును వినియోగించుకునేందుకు ఆసక్తి కనబర్చడమనేది వైఎస్సార్ సీపీకి అనుకూల వాతావరణానికి చిహ్నంగా చెప్పుకోవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.

 చీరాలతో పాటు కనిగిరి, గిద్దలూరులో  కూడా మహిళా ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదుకావడం విశేషం. జిల్లాలో ఎన్నికల ప్రచారం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పర్యటనతో పట్టణ జనంలో మరింత ఉత్సాహం పెరిగింది. రాష్ట్రవిభజనపై కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు సంబంధించి షర్మిల ప్రసంగాలు యావత్ మహిళా లోకాన్ని కదిలించింది. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన మేలు, పథకాల గురించి షర్మిల గుర్తుచేసిన విషయాలను ఓటర్లు అర్థం చేసుకున్నారు. ఆ ప్రభావమే  మున్సిపల్ ఎన్నికల్లో తీవ్రంగా పనిచేసిందని పలువురు విపక్షాల నేతలే చెబుతున్నారు.

 స్లమ్‌కాలనీల్లో సాలిడ్ ఓటింగ్..
 రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ‘ప్రత్యేక’ పరిస్థితులు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ప్రభావితం చేశాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హఠాన్మరణం, అనంతరం ప్రభుత్వ పాలనలో మారిన మార్పులు, వైఎస్సార్ కుటుంబంపై ఆరోపణలు, ఒత్తిళ్లు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చడం.. టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడి వ్యూహాత్మక రాజకీయాలు నడిపించడంపై ఆయా వర్గాలు తల్లడిల్లిపోయాయి. వారంతా తమ అభిప్రాయాన్ని ఓటురూపంలో చూపేందుకు సిద్ధపడ్డారు. ఆమేరకు పోలింగ్ రోజున ఉదయాన్నే బూత్‌ల వద్ద పెద్దఎత్తున బారులు తీరి స్వేచ్ఛగా  ఓటుహక్కు వినియోగించుకున్నారు.

 ఎన్నడూ లేనంతగా అద్దంకి, చీమకుర్తి శివారుకాలనీల బడుగు, బలహీనవర్గాల ఓటర్లు పోలింగ్ బూత్‌లకొచ్చి ఓట్లేయడం గమనార్హం. ఆయా పట్టణాల అగ్రవర్ణాల పోలింగ్‌బూత్‌లతో పోల్చితే, దళిత, బీసీ కాలనీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్‌లలో అత్యధిక పోలింగ్ శాతం నమోదవడాన్ని గమనించాల్సి ఉంది. ఆయాచోట్ల అగ్రవర్ణాల పోలింగ్ 76 నుంచి 78 శాతం వరకు నమోదైతే, ఇతర సామాజికవర్గాల బూత్‌లలో 85 శాతానికి మించి పోలింగ్ నమోదవడం గమనార్హం. ఇదే అంశాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిసింది. ఎక్కువశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపునే మొగ్గుచూపి ఓట్లేసినట్లు వివిధ నిఘా సంస్థల సర్వేల్లో కూడా వెల్లడైన అంశం.

 కుమ్మక్కై కుదేలైన టీడీపీ, కాంగ్రెస్‌లు..
 అన్నిచోట్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను నియంత్రించేం దుకు టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు కుట్రను అమలుచేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే కొన్నిచోట్ల కాంగ్రెస్ నేతలు టీడీపీల అభ్యర్థులకు పరోక్ష సహకారాన్నందించారు. అదే ప్రచారం చివరి రోజుల్లో నేరుగా కొన్నిచోట్ల ప్రత్యక్షంగానే టీడీపీకి ఓట్లేయాలని కాంగ్రెస్ నేతలు ఓటర్లకు చెప్పడం తెలిసిందే. ఏది ఏమైనా ఆ రెండు పార్టీల కుమ్మక్కు కుట్ర పోలింగ్ రోజున దారుణంగా భగ్నమైంది. చీరాలలో 79.54 శాతం పోలింగ్ నమోదుకాగా, మార్కాపురంలో 73.79 శాతం, అద్దంకిలో 85.55 శాతం, చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 85.98 శాతం, గిద్దలూరులో 78.38 శాతం, కనిగిరి మున్సిపాలిటీలో 84.50 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తానికి ప్రజల్లో దివంగత వైఎస్సార్‌పై.. ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిపై గూడుకట్టుకున్న అభిమానాన్ని ఓటు రూపంలో నిరూపించుకున్నారు. ఇదే ప్రభావం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement