* తెలంగాణలో రేపే పోలింగ్
* సీఈవో భన్వర్‌లాల్
* మొదటి కంపార్ట్‌మెంట్‌లో పార్లమెంట్ అభ్యర్థుల ఈవీఎం.. రెండో కంపార్ట్‌మెంట్‌లో అసెంబ్లీ అభ్యర్థుల ఈవీఎం
* పోలింగ్ నిర్వహణ, భద్రతకు 3.5 లక్షల మంది సిబ్బంది
* 12,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ పోలీసులు
* 16,512 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్.. ప్రధాన కూడళ్లలో తెరలపై పోలింగ్ ప్రసారం
* పోలింగ్ రోజు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలతో సహా అందరికీ సెలవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాల్లో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు మరో 24 గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవుతుంది. నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో మినహా మిగతా చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. జిల్లా కలెక్టర్ల వినతి మేరకు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని తగ్గించినట్లు చెప్పారు.
3 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, 7 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో పోలింగ్‌కు పూర్తి భద్రత కల్పిస్తున్నామని, ఓటర్లు అందరూ తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి నిర్భయంగా నచ్చిన వారికి ఓటు వేయాలని చెప్పారు. సోమవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించారు..
* నక్సలైట్ ప్రభావిత భూపాలపల్లి, ములుగు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. సిర్పూర్, చెన్నూరు, ఆసిఫాబాద్, ఖానాపూర్, మంథని, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మిగతా 109 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు లైన్‌లో ఉన్నవారికి ఎంత సమయం అయినా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
* పోలింగ్ కేంద్రాల్లో తొలుత పార్లమెంట్ అభ్యర్థులకు ఓటు వేసే కంపార్ట్‌మెంట్ ఉంటుంది. తెలుపు రంగు బ్యాలెట్ పార్లమెంట్ అభ్యర్థులకు ఉంటుంది.
* రెండో కంపార్టుమెంట్‌లో అసెంబ్లీ అభ్యర్థుల ఈవీఎం ఉంటుంది. గులాబీ రంగు బ్యాలెట్ అసెంబ్లీ అభ్యర్థులకు ఉంటుంది.
* పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించరు. అందువల్ల వాటిని ఇళ్లలోనే పెట్టి రావాలి. ఓటర్ల క్యూల నిర్వహణకు ఎన్‌ఎస్‌ఎస్ వంటి సంస్థల వలంటీర్లను ఏర్పాటు చేశారు.
* భద్రత కోసం మొత్తం 3.5 లక్షల మంది సిబ్బందిని సిద్ధం చేశారు. 1.40 లక్షల మంది పోలీసులు, 162 కేంద్ర సాయుధ కంపెనీలను భద్రతకు వినియోగిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఇద్దరేసి పోలీసులు ఉంటారు.
* మొత్తం 30,518 పోలింగ్ కేంద్రాల్లో 12,000 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో సాయుధ పోలీసులను నియమిస్తారు.
* తెలంగాణలో 16,512 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
* మండల, నియోజకవర్గ కేంద్రాలు, పట్టణ కూడళ్లలోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని తెరలపై చూపిస్తారు. అభ్యర్థులు, పార్టీల నాయకులు, ప్రజలు పోలింగ్ సరళిని తెరలపై పరిశీలించవచ్చు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణతో పాటు, స్టాటిక్ కెమెరాలు, మైక్రో పరిశీలకులను ఏర్పాటు చేశారు.
* తెలంగాణలో పోలింగ్ జరిగే బుధవారంనాడు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలు, ఐటీ సంస్థలు, దుకాణాలన్నింటికీ సెలవు ప్రకటించారు. సెలవు ఇవ్వని యాజమాన్యంపై కేసు నమోదు చేస్తారు. ఏడాది పాటు జైలు శిక్షపడుతుంది.
* తెలంగాణ జిల్లాల్లో మొత్తం 2,81,74,055 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,43,82,661 మంది కాగా మహిళా ఓటర్లు 1,37,81,276 మంది ఉన్నారు, ఇతర ఓటర్లు 2,329 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు మొత్తం 7,786 మంది ఉన్నారు. ముగ్గురు ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉన్నారు.
* నియోజకవర్గాల్లో ఓటర్లు కాని నేతలు ఎవరూ ఉండకూడదు. అటువంటి వారిని పోలీసులు బయటకు పంపిస్తారు.
* ఓటరు స్లిప్పుల పంపిణీ మంగళవారానికి 90 శాతం పూర్తవుతుంది. ఓటర్ స్లిప్ అందకపోయిన వారు జాబితాలో పేరు ఉంటే వెళ్లి ఓటు వేయవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా, ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకుని వెళ్లి ఓటు వేయవచ్చు. ఓటరు స్లిప్పులతో పోలింగ్ కేంద్రాల దగ్గర బూత్‌స్థాయి ఆఫీసర్లు ఉంటారు. వారి నుంచి స్లిప్పులు తీసుకోవచ్చు.
* అభ్యర్థులు పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల అవతల 10/10 సైజుకు మించకుండా టెంట్ వేసుకోవచ్చు. ఆ టెంట్, కుర్చీలు, టేబుళ్ల ఖర్చును అభ్యర్థి ఖాతాలో జమ చేస్తారు.
* పోలింగ్ రోజు నియోజకవర్గంలో తిరగడానికి ప్రతి అభ్యర్థికి ఒక వాహనాన్ని, ఎన్నికల ఏజెంట్‌కు ఒక వాహనాన్ని, పార్టీ కార్యకర్తలకు ఒక వాహనానికి అనుమతిస్తారు.
* సెక్యూరిటీ ఉండి, అభ్యర్థులు కాని నేతలు పోలింగ్ రోజు ఓటు వేయడానికి మాత్రమే బయటకు రావాలి. ఓటు వేసి ఇంటికి వెళ్లిపోవాలి. బయట తిరిగితే అలాంటి వారిని గృహ నిర్బంధం చేస్తారు.
* సెక్యూరిటీ గల అభ్యర్థుల వెంట 24 గంటలూ షోడో బృందాలతో నిఘా ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల లోపు అభ్యర్థులు ఎటుంటి ప్రచారం చేయకూడదు.
* పోలింగ్ విధుల్లోని సిబ్బంది, పోలీసులు అభ్యర్థులకు అనుకూలంగా ఎటువంటి చర్యలు చేపట్టకూడదు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
* పోలింగ్ రోజు ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్ నిర్వహించకూడదు. పోలింగ్ ముగిసే వరకు ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఎస్‌ఎంఎస్‌లు, సామాజిక మీడియా ద్వారా ప్రచారం నిర్వహించకూడదు. పోలింగ్ రోజు అభ్యర్థులను, ఓటర్లను ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూలు చేయకూడదు. ఓటు ఎవరికి వేశారో అడగకూడదు. అలా అడిగిన వారిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటారు. పత్రికల్లో ప్రచారంపై ఎటువంటి నిషేధం లేదు. అయితే ఆ ప్రచారానికయ్యే వ్యయాన్ని అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారు.
* పోలింగ్ ముగిసే వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. దుకాణాల వెనుక నుంచి, ఇతరత్రా మార్గాల్లో విక్రయించిన వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేస్తారు.
* తెలంగాణ జిల్లాల సరిహద్దుల్లోని సీమాంధ్ర నియోజకవర్గాల్లో మద్యం విక్రయాలపై కూడా నిషేధం విధించారు.
* బళ్లారి వరకు హెలికాప్టర్లలో మద్యం, డబ్బు, ఇతర ఆభరణాలు తరలించి అక్కడి నుంచి అనంతపురానికి వాహనాల్లో తరలిస్తున్నారు. అందువల్ల బళ్లారి వెళ్లే హెలికాప్టర్లను, అక్కడి నుంచి వచ్చే వాహనాల తనిఖీకి ఆదేశాలు జారీ చేశారు.
నిర్భయంగా ఓటు వేయండి
Published Tue, Apr 29 2014 12:52 AM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM
Advertisement