చంద్రబాబు అబద్ధాలకోరు
విజయనగరం జిల్లా వైఎస్సార్ జనభేరిలో వైఎస్ విజయమ్మ ధ్వజం
నెల్లిమర్ల(విజయనగరం) : ‘‘చంద్రబాబు ఓ అబద్ధాలకోరు.. తొమ్మిదేళ్ల ఆయన హయాంలో ఎన్నో కంపెనీలను తన బినామీలైన సీఎం రమేష్, సుజనాచౌదరి, బిల్లీరావులాంటివాళ్లకు అప్పనంగా కట్టబెట్టాడు. ఎన్నో కంపెనీలను మూయించి ఏడున్నర లక్షలమంది కార్మికులను రోడ్డున పడేశాడు. 26 వేలమందిని ఉద్యోగాల నుంచి తీసేశాడు. అటువంటి చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెబుతున్నాడు. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొత్తం మూడున్నర కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసి, పలు కంపెనీలను మూసివేయించి 7.5 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్తే ఎవరూ నమ్మబోరు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు.
‘‘చంద్రబాబూ... రాష్ట్ర బడ్జెట్ ప్రస్తుతం రూ.1.2 లక్షల కోటు.్ల రైతుల రుణాలు మాఫీ చేయాలంటే 1.5 లక్షల కోట్లు కావాలి. అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తావు? కరెంటు బిల్లులు కట్టలేదని రైతులను జైల్లో పెట్టించిన నువ్వు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా?’’ అని ప్రశ్నించారు. 2004లో రుణమాఫీ కోసం రాజశేఖరరెడ్డి హామీ ఇస్తే కేంద్రాన్ని ఒప్పించేందుకు మూడేళ్లు పట్టిందన్నారు. కే ంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి 60 వేల కోట్లు రుణమాఫీగా ప్రకటిస్తే, అందులో రాష్ట్రానికి 12వేల కోట్లు కేటాయించారని చెప్పావు. అప్పట్లో రైతుల రుణాలు మాఫీ చేయడమే కాకుండా అప్పటికే చెల్లించిన రైతులకు వైఎస్సార్ అయిదు వేల రూపాయలు చొప్పున ప్రోత్సాహకాలు అందజేశారని గుర్తు చేశారు. విజయమ్మ బుధవారం విజయనగరంలో, చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి, నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ, ఒమ్మి, సతివాడ గ్రామాల్లో వైఎస్సార్ జనభేరి సభల్లో ప్రసంగించారు.