ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి
గుంటూరుసిటీ,న్యూస్‌లైన్ :సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ బూత్‌ల వద్ద ప్రజలకు ఎండ తగలకుండా టెంట్‌లు, తాగునీటి వసతి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ సమాధానమిస్తూ జిల్లాలోని 17 నియోజకవర్గాలకు గాను 11 మంది మాత్రమే ఈవీఎం ఇంజనీర్లు ఉన్నట్లు చెప్పారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో గత ఎన్నికలలో అతితక్కువ ఓటింగ్ నమోదైన దృష్ట్యా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు చెప్పారు. దీనిద్వారా క్యూలో ఎంతమంది ఉన్నారనే సమాచారం కూడా తెలుసుకోవచ్చన్నారు. జిల్లాలో 83 శాతం వరకు ఓటర్‌స్లిప్పులు పంపిణీ చేశామని, 6వ తేదీ లోపు నూరు శాతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టరు వివేక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వెబ్‌కాస్టింగ్‌పై అవగాహన..
సార్వత్రిక ఎన్నికలకు వెబ్ కాస్టింగ్ సక్రమంగా నిర్వహించాలని జేసీ వివేక్‌యాదవ్ ఆదేశించారు. ఆదివారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపం, శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలలో ఇంజనీరింగ్ విద్యార్థులకు వెబ్‌కాస్టింగ్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఎన్నికల సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా జాగ్రత్తగా వీడియో గ్రఫీ చేయాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు ఆర్డీవో బి.రామ్మూర్తి, వివిధ కళాశాలల ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.