ఏలూరు-జంక్షన్ మధ్య రాజధాని
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సీమాంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు ఏలూరు-హనుమాన్ జంక్షన్ మధ్య ప్రాంతం అన్నివిధాలుగా అనువైనదని, ఈ ప్రతిపాదనకు అన్నివర్గాలు మద్దతు తెలపాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, వైఎస్సార్ సీపీ ఏలూరు లోక్‌సభా స్థానం అభ్యర్థి తోట చంద్రశేఖర్ కోరారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయూలనే విషయాన్ని నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించిందని తెలిపారు. రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఏలూరు-హనుమాన్‌జంక్షన్ మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఆ కమిటీకి తాను పంపించానని తెలిపారు.
ఈ ప్రాంతాన్ని రాజధాని చేయూలని కోరుతూ అన్నివర్గాలు ఈ కమిటీకి సలహాలు, సూచనలు పంపించాలని కోరారు. అభిప్రాయాలు పంపేందుకు మే 7వ తేదీ వరకూ సమయం ఉందని, యువకులు, విద్యావంతులు, మేధావులంతా స్పందించాలని కోరారు. తమ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు చెందిన జ్ఛ్ఛఛీఛ్చఛిజు.్ఛ్ఠఞఛిౌఝ్టః ఝజ్చి. జౌఠి.జీ వెబ్‌సైట్‌కు పంపాలని కోరారు. ఏలూరు-జంక్షన్ ప్రాంతం రాజధానికి ఏవిధంగా అనువుగా ఉందనే దానిపై తాను పలు సూచనలు చేసినట్లు తెలిపారు. భూమి లభ్యత ఎక్కువగా ఉందని, లక్ష ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు రెండు లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని వివరించారు. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను ఇందులోంచి తీసుకోవచ్చని తెలిపారు. కృష్ణా-గోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతం కావడంతో నీటి లభ్యత ఎక్కువగా ఉందని, తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.
మచిలీపట్నం, కాకినాడ పోర్టుల మధ్య ప్రాంతం కావడంవల్ల పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు, అభివృద్ధికి, జల రవాణాకు అనుకూలమని స్పష్టం చేశారు. గన్నవరం, రాజమండ్రి ఎయిర్‌పోర్టుల మధ్య ఉండటం, ఐదో నంబర్ జాతీయ రహదారి ఉండటం, దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు అతి సమీపంలో ఉండటంతోపాటు బ్రాడ్‌గేజ్ రైలు మార్గం ఉండటం వల్ల ఈ ప్రాంతం రవాణా వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టు వల్ల అదనంగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కానుందని, దీనివల్ల విద్యుత్ సమస్య కూడా ఉండదని వివరించారు. అన్నిటికీ మించి భౌగోళికంగా ఏలూరు-జంక్షన్ ప్రాంతం సీమాంధ్రకు నడిబొడ్డుగా ఉందన్నారు. రాజధాని ఏర్పాైటైతే ఈ ప్రాంతంలో అనూహ్యమైన అభివృద్ధి జరుగుతుందని, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇక్కడి వారంతా రాజధాని ప్రతిపాదనకు మద్దతు తెలిపి హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌కు అభిప్రాయాలు, సూచనలు పంపాలని కోరారు.