సాక్షి, కర్నూలు: ఏమి చేసైనా ఎన్నికల్లో గెలవాలి. ఎన్ని అడ్డదారులు తొక్కినా లక్ష్యం చేరుకోవాలి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. ప్రత్యర్థి పార్టీ బలంగా ఉండటంతో ఓ నేత దిగజారుడు రాజకీయానికి తెరతీశారు. తన ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ నాయకుడు ఎన్నికల కమిషన్ కళ్లుగప్పి ప్రలోభాలపర్వానికి శ్రీకారం చుట్టారు. ఈ వ్యవహారం కర్నూలు నియోజకవర్గంలో చాపకింద నీరులా సాగిపోతోంది. ఎవరిని ఎలా లోబర్చుకోవాలి.. ఇతర పార్టీల వ్యూహమేంటి.. దారికి రాని ఓటర్లను తనవైపు తిప్పుకునేదెలాగనే విషయాల్లో ఈయన పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళలు కీలకభూమిక పోషించనున్నారు. డ్వాక్రా మహిళల పాత్ర మరింత కీలకమవుతోంది. వీరికి నేరుగా డబ్బు ముట్టజెబితే మొదటికే మోసం వస్తుందనే భయంతో ఆచితూచి అడుగులేస్తున్నారు. బ్యాంకులు గ్రూపులకు మంజూరు చేసిన రుణాలను చెల్లించే బాధ్యతను ఆ అభ్యర్థి తన భుజానికెత్తుకున్నారు. ఏ సంఘానికి ఎంత రుణ బకాయి ఉందో సేకరించిన ఆయన ఆ మొత్తాన్ని తన నమ్మినబంటుల ద్వారా జమ చేయించేస్తున్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
వడ్డీ వ్యాపారులను సైతం తన చెప్పుచేతల్లోకి తీసుకున్నారీయన. నగరంలో కొన్ని వర్గాల ప్రజలు రోజువారీ వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. ఇలాంటి వారి వివరాలను వడ్డీ వ్యాపారుల నుంచి సేకరించి ఆ మొత్తాన్ని సదరు అభ్యర్థే చెల్లించేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా ఆయన ఈ తతంగాన్ని నడిపిస్తుండటం గమనార్హం.
తన ఎన్నికల ప్రచారంలో ద్విచక్ర వాహనాలతో పాల్గొనే యువతకు రోజూ మూడు లీటర్ల పెట్రోల్ కొట్టిస్తున్నారు. కార్లు.. ఆటోలు.. ఇతర వాహనాలకు చీటీలు రాసిచ్చి కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఉచితంగా పోసేలా ఒప్పందం చేసుకున్నారు. తద్వారా ఎక్కడా సొమ్ము చేతులు మారిన ఆనవాళ్లు కూడా బయటపడకుండా ఆయన చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.
రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఆయన రూ.5 వేలు ముట్టజెబుతున్నారు. అయితే రేషన్ కార్డును తన దగ్గరే పెట్టుకుని.. పోలింగ్ రోజున ఓటు ఆయనకే వేసినట్లు తన అనుయాయులకు సమాచారం అందించాలనే మెలిక పెట్టారు. ఫలితాల తర్వాత కార్డును తీసుకెళ్లాలనే నిబంధన విధించారు. ఈ వ్యవహారాన్ని పక్కాగా నిర్వహించేందుకు కొన్ని ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
తన బండారం బయటపడకుండా ఈయన పోలీసులనూ మచ్చిక చేసుకున్నట్లు తెలిసింది. పోలీసు శాఖలోని ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లను కొనుగోలు చేసేందుకూ 15 రోజుల కిందటే పథక రచన చేసినట్లు సమాచారం. ఈ విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా ఆ శాఖకు చెందిన కొందరు ఉద్యోగులను ఉపయోగించుకున్నట్లు సమాచారం.
ప్రలోభం.. ‘పచ్చ’తోరణం
Published Mon, Apr 28 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement