మోడీ ప్రధానైతే వినాశనమే: మమత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతలు సోమవారం నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. మమత పెయింటింగ్‌లు అత్యధిక ధరలకు అమ్ముడుపోవడంపై మోడీ అనుమానం వ్యక్తం చేయడంతో ఆమె మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయన అధికారంలోకి వస్తే దేశం సర్వనాశనమవుతుందని, చీకటిలో కూరుకుపోతుందన్నారు. 35 ఏళ్ల వామపక్ష పాలనలో బెంగాల్‌కు జరిగిన నష్టం కంటే..
మమత బెనర్జీ 35 నెలల పాలనలో జరిగిన నష్టమే ఎక్కువన్న మోడీ వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. అల్లర్ల రూపకర్తలు తనకు అభివృద్ధిపై జ్ఞానోదయం చేయాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు తృణమూల్ నేతలు మోడీని కసాయిగా అభివర్ణించారు. మోడీ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మోడీ ప్రసంగ సీడీ, ఇతర వివరాలను తమకివ్వాలని ఈసీ.. అధికారులను ఆదేశించింది.