సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నెల రోజుల్లో పోలీసుల తనిఖీల్లో కట్టల కొద్దీ నగలు, నగదు బయట పడుతున్నాయి. ఓటర్ల ను ప్రలోభాలకు గురి చేసేందుకు నిల్వ చేసిన మ ద్యం, సారా తయారీ సామగ్రి సంచుల కొద్దీ వెలుగు చూస్తోంది. గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు అన్ని ఎన్నికలు మూకుమ్మడిగా రెండు నెలల వ్యవధిలోనే జరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు క దుపుతున్న నేతలు ఓటర్లను ప్రలోభాలతో ముంచెత్తేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
దీంతో రాబోయే రోజుల్లో పోలీసుల తనిఖీల్లో మరింత న గదు, మద్యం నిల్వలు బయట పడే సూచనలు కనిపిస్తున్నాయి.మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగడంతో మార్చి మూడో తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల షెడ్యూలు కూడా వెలువడటంతో మే మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో వుండనుంది. దీంతో ఓటర్లపై నేతలు ప్రలోభాలతో ఎర వేయకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 42 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసు, రెవెన్యూ యంత్రాంగం వాహనాల రాకపోకలపై నిఘా వేసింది.
మరోవైపు ఎక్సైజ్ విభాగం కూడా క్షేత్ర స్థాయిలో సారా తయారీ, విక్రయ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నెల రోజుల్లోనే జిల్లాల్లో 2.82 కోట్ల నగదు తనిఖీల్లో బయట పడింది. మరో రూ.24లక్షల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నగదు, బంగారం విలువ సుమారు రూ.3.06 కోట్లుగా అంచనా వేశారు. వీటితో పాటు 15,452 మద్యం సీసాలు, సారా తయారీకి వినియోగించే తొమ్మిది వేల కిలోలకు పైగా నల్ల బెల్లం ఎక్సైజ్ దాడుల్లో బయట పడింది. మరో నెల రోజులపాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుండటంతో మద్యం, నగదు మరింత వెలుగు చూసే అవకాశం ఉంది.
తనిఖీల పేరిట వేధింపులు
జిల్లాతో పాటు అంతర్రాష్ట సరిహద్దుల్లోనూ ఎన్నికల సందర్భంగా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే తనిఖీల పేరిట వారు వ్యవహరిస్తున్న తీరుపై సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది పాటి మొత్తాన్ని వెంట తీసుకెళ్తున్నా వేధింపులకు గురి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
పనిలో పనిగా కొన్ని చెక్‌పోస్టుల్లో వాహనాల తనిఖీ పేరిట సరైన కాగితాలు లేవంటూ ‘చిల్లర’ వసూళ్లకు దిగుతున్నారు. అప్పన్నపేట చెక్‌పోస్టు వద్ద నగదు స్వాధీనం విషయంలో కక్కుర్తి పడిన ఐదుగురు సిబ్బందిపై ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు. కాగా తనిఖీల్లో బయట పడుతున్న నగదులో ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీల్లో భాగంగా తరలుతూ తనిఖీల్లో చిక్కుతున్నట్లు వెల్లడవుతోంది.
నోట్ల..గుట్టలు...!
Published Thu, Apr 3 2014 3:10 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement