పలకజీడిలో 13న రీపోలింగ్
- భారీగా పోలీసు భద్రత
- రేపు ఈవీఎంలు, సిబ్బంది తరలింపు
పాడేరు,న్యూస్‌లైన్: కొయ్యూరు మండలం పలకజీడిలో ఈ నెల13న రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మావోయిస్టులు ఈవీఎంలు,ఎన్నికల సిబ్బంది వాహనాన్ని దగ్ధం చేయడంతో ఈ నేల 7న ఇక్కడ పోలింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈమేరకు పలకజీడిలో రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రాజకుమారి తెలిపారు. సోమవారం సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలకు అక్కడికి తరలిస్తామన్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మంగళవారంనాటి రీపోలింగ్‌కు భారీగా భద్రత చర్యలు చేపడుతున్నామని నర్సీపట్నం ఓఎస్డీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పోలీసు కూంబింగ్ పార్టీలు విస్త్రృతంగా గాలిస్తున్నాయన్నారు. రీపోలింగ్ ప్రశాంతంగా జరిగి,ఎన్నికల సిబ్బంది క్షేమంగా వచ్చేంత వరకు పోలీసుల భద్రత ఉంటుందన్నారు. గిరిజనులు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు.