జార్ఖండ్‌లోని సిల్లి నియోజకవర్గంలో ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సోమవారం 14 చోట్ల ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో రెండు, యూపీలో ఒకటి, నాగాలాండ్‌లో ఒక పార్లమెంటు స్థానాలకు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 31న జరగనుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా–గోందియా లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల్లో ఈవీఎంల గందరగోళంపై శివసేన, ఎన్సీపీలు మండిపడ్డాయి. 25శాతం ఈవీఎంలు సరిగా పనిచేయలేదని మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్‌పటేల్ అన్నారు. చాలాచోట్ల వీవీపీఏటీ (ఓటు ధ్రువీకరణ యంత్రం)లు పనిచేయలేదన్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంపై విచారణ జరిపించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. భండారా–గోందియాలో 40%, పాల్ఘర్‌లో 46% ఓటింగ్ నమోదైంది. నాగాలాండ్ లోక్‌సభ స్థానంలో 70 శాతం పోలింగ్ నమోదైంది.
కైరానాలో హైరానా!
అటు యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం, నూర్‌పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంల విషయంలో అధికార, విపక్షాలు విమర్శలు గుప్పించుకున్నాయి. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఎన్నికల సంఘం వేరే ఈవీఎంలను ఏర్పాటుచేసింది. వీలుకాని చోట్ల రీపోలింగ్ జరపనుంది. కాగా, ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందని ఎస్పీ, బీఎస్పీలు ఆరోపించాయి. పలుచోట్ల ఈవీఎంలు చాలాసేపు పనిచేయకపోవడంపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కైరానాలో 54.17% పోలింగ్ నమోదైంది. కర్ణాటకలోని రాజరాజేశ్వర నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 54 శాతం పోలింగ్ నమోదైంది. కొన్నిచోట్ల సమస్య ఉత్పన్నమైన మాట వాస్తవమేనని.. కానీ విపక్షాలు దీన్ని ఎక్కువచేసి చూపిస్తున్నాయని ఈసీ పేర్కొంది. చాలాచోట్ల ముందుగానే అదనపు ఈవీఎంలు ఏర్పాటుచేశామని తెలిపింది.
ఉప ఎన్నికలు జరిగిన లోక్‌సభ స్థానాలు
కైరానా (యూపీ)
2014 ఎన్నికల్లో విజేత: హుకుమ్‌సింగ్ (బీజేపీ)
ప్రత్యర్థి: నహీద్ హసన్ (ఎస్పీ)
మెజారిటీ: 2,36,828
పాల్ఘర్ (మహారాష్ట్ర)
2014లో విజేత: చింతామన్ వానగా (బీజేపీ)
ప్రత్యర్థి: బలిరాం (బహుజన్ వికాస్ అఘాడీ)
మెజారిటీ: 2,39,520
భండారా–గోందియా (మహారాష్ట్ర)
2014లో విజేత: నానాభావ్ పటోలే (బీజేపీ)
ప్రత్యర్థి: ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ)
మెజారిటీ: 1,49,254
నాగాలాండ్
2014లో విజేత: – నీఫియూ రియో (ఎన్‌పీఎఫ్)
ప్రత్యర్థి: కేవీ పుసా (కాంగ్రెస్)
మెజారిటీ: 4,00,225
Comments
Please login to add a commentAdd a comment