అభివృద్ధికే మా ఓటు
* ఐటీ హబ్ సంగతేంటి.. అటకెక్కిన గన్నవరం విమానాశ్రయ విస్తరణ
* టీడీపీ ఎంపీకి పట్టని మిస్సైల్ టెస్ట్ రేంజ్ ప్రాజెక్టు
* సంక్షేమ సారథినే గెలిపిస్తామంటున్న కృష్ణాజిల్లావాసులు
కళలకు పుట్టిల్లు.. పరిశ్రమలకు పొదరిల్లు.. రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పేరొందిన కృష్ణా జిల్లా అభివృద్ధిలో మాత్రం ఒక అడుగు వెనుకే ఉంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దినదినాభివృద్ధి చెందిన జిల్లా ప్రస్తుతం వెనుకబడిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు బెజవాడపైనే. ఈ ప్రాంతవాసులు మాత్రం సంక్షేమ సారథికే పట్టం కడతామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇటీవల ‘సాక్షి’ నిర్వహించిన రోడ్ షోలో ఈ విషయం స్పష్టమైంది.
విజయవాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎ.అమరయ్య: విజయవాడ బస్టాండ్‌లో దిగి బెంజిసర్కిల్‌కు వెళ్తుం డగా బందరు రోడ్డంతా ఎన్నికల సందడే కనిపించింది. గత ఎన్నికల్లో పెద్దగా లేని ఇంటర్నెట్‌లు, ఫేస్‌బుక్‌లు కనిపించాయి. బీసీ రిజర్వేషన్లు, సామాజిక సమీకరణాలపై చర్చలు వినిపించాయి. గతానికి భిన్నంగా సరికొత్త రాజకీయ భాష, సాంకేతిక పరికరాలపై అన్ని రాజకీయ పక్షాలు ప్రత్యేక దృష్టి సారించాయి.
అభివృద్ధి జాడలేవీ?
సుమారు 46 లక్షల జనాభా, 16 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలున్న కృష్ణా జిల్లా కూచిపూడి నృత్యానికి పురిటిగడ్డ. 70 శాతానికి పైబడి అక్షరాస్యులున్న ప్రాంతం. అభివృద్ధికి అనేక అవకాశాలున్నా అడుగుముందుకు పడని జిల్లా. విశాఖ తర్వాత పెద్ద నగరమైన విజయవాడ యువత ఉపాధి కోసం వలసపోతూనే ఉంది. పశ్చిమ కృష్ణా అంతటా నీటి కొరత ప్రధాన సమస్య అయితే, తూర్పు కృష్ణాకూ నీటితోనే ఇబ్బంది. ఒకచోట తాగునీటికీ కటకట, మరోచోట ముంపు.
ఏతావాతా సమస్య నీళ్లదే. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అనువైన ప్రాంతమైనప్పటికీ పట్టుమని వెయ్యిమందికి ఉపాధి చూపించే పరిశ్రమలేవీ ఇక్కడ లేవు. వ్యవసాయాధారిత ప్రాంతమైనా అనుబంధ పరిశ్రమలు లేవు. ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ తర్వాత ఎక్కువ ఉపాధి చూపిస్తున్నది విజయవాడ థర్మల్ పవర్‌స్టేషనే. ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు తరలిపోయాయి. మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్ వ్యాపారం వెలవెలబోతోంది. కొండపల్లి బొమ్మలు అటకెక్కాయి. సరిగ్గా ఈ దశలో జమిలిఎన్నికలకు జిల్లా సిద్ధమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సరైన నేత కోసం యువత దృష్టి సారించింది. తానొస్తేనే అభివృద్ధి అంటున్న బాబును, యువతకు భరోసా, ఉపాధికి హామీ ఇస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని బేరీజు వేసి చూస్తున్నారు. జగన్‌వైపే మొగ్గు చూపుతున్నారు.
పేరుకే ఆర్థిక రాజధాని
విజయవాడ వాణిజ్య రాజధానిగా పేరొందినా ఇక్కడి వ్యాపారం ఈ రాష్ట్రానికే పరిమితం. బంగినపల్లి మామిడి తప్ప మిగతావేవీ ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతయ్యే పరిస్థితి లేదు. అది కూడా గత ఏడాది ఆగింది.
ఎవరికీ పట్టని ఐటీ పార్క్
విజయవాడ కేంద్రంగా యువతకు పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో కేసరపల్లి గ్రామం వద్ద నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఐటీ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.70 కోట్లతో, లక్షా 75వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో తలపెట్టిన ఈ పార్క్ 2010లో పూర్తయింది. వైఎస్ ఉన్నప్పుడు ఇక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెట్టేందుకు ముందుకు వచ్చిన అంతర్జాతీయ సంస్థలు ఆయన మరణంతో వెనుకడుగు వేశాయి. దీంతో కేవలం 15,550 చదరపు అడుగుల్లో మాత్రమే సంస్థలు ఏర్పడ్డాయి.
అటకెక్కిన గన్నవరం విమానాశ్రయ విస్తరణ
వైఎస్ హయాంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణకు కసరత్తు జరిగింది. మొదట్లో ఇందుకు కావాల్సిన భూమి ఇచ్చేందుకు నిరాకరించిన రైతుల్ని వైఎస్ ప్రభుత్వం అంగీకరింపజేసినా ఇప్పుడు దాన్ని పట్టించుకునే వారే లేకపోయారు.
కోయంబత్తూరులా అభివృద్ధి చేస్తా..
జిల్లాలో సమస్యలపై ఇటీవల విజయవాడలోని పలువురు పారిశ్రామికవేత్తలు లోక్‌సభ అభ్యర్థులతో చర్చించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ తాను గెలిస్తే ఏమీ చేస్తానో వివరించిన తీరు పారిశ్రామికవేత్తలను అబ్బురపరిచింది. కోయంబత్తూరు మాదిరిగా ఐటీ హబ్, ఆటోరంగ విస్తరణకు తాను ఎలా కృషిచేస్తానో, ఉపాధి ఎలా కల్పిస్తానో వివరించి కార్మికులను ఆకట్టుకున్నారు. దీంతో వందలమంది పారిశ్రామికవేత్తలు కోనేరుకు మద్దతు పలికారు.
మిస్సైల్ టెస్ట్ రేంజ్ ప్రాజెక్టు సంగతేంటి..
నాగాయలంక మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన మిస్సైల్ టెస్ట్ రేంజ్ ప్రాజెక్టు ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. రూ.వెయ్యికోట్లతో, 260 ఎకరాల విస్తీర్ణంలో డీఆర్డీఏ ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు కృష్ణాజిల్లా పాలిట వరం. ఈ ప్రాజెక్టు వాస్తవానికి 2012లో చేపట్టాల్సి ఉన్నా, గతంలోని టీడీపీ ఎంపీ పట్టించుకోలేదు. దీంతో విశ్వాసం కోల్పోయిన మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసే సత్తా తనకే ఉందని వైఎస్సార్ సీపీ లోక్‌సభ అభ్యర్థి కొలుసు పార్థసారథి చెబుతున్నారు.
సంక్షేమ సారథికే పట్టం
‘మాకు అభివృద్ధి కావాలి. యువత నిరాశ, నిస్పృహల్లో ఉంది. వారిని ఆదరించే వ్యక్తి కావాలి. దానికి చంద్రబాబు తగిన వ్యక్తి కాదు. ప్రజా సంక్షేమం, విద్య, వైద్యం వంటివి అమలు కావాలంటే ఎవరు తగిన వ్యక్తో జనం ఇప్పటికే నిర్ణయించుకున్నారు. మే 7న తీర్పు ఇస్తారు’ అని పటమటలంకకు చెందిన వ్యాపారి రమేష్‌చంద్ర చెప్పారు. ఏదిఏమైనా ఈసారి జిల్లాలో గతంలో గెలిచిన సీట్లను నిలబెట్టుకోడానికి టీడీపీ ఎదురీదుతోంది. వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయంగా ప్రజాభిప్రాయం ఉంది.
బాబూ.. ఇంతకీ నువ్వు ఎవరి వైపు?
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఇటీవల కొందరు పారిశ్రామికవేత్తలు సుమారు 20 రోజులు 13 జిల్లాల్లో యాత్ర చేశారు. చిత్రమేమిటంటే.. ఈ యాత్రను చంద్రబాబు ప్రారంభించడమే. పారిశ్రామికవేత్తల్ని ఎందుకూ కొరగాకుండా చేసిన బాబుకు ఈ అర్హత ఉందా? అని విజయవాడకు చెందిన ఓ బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు ప్రశ్నిస్తే, అసలు ఇంతకీ ఈ బాబు ఎవరి పక్షం అంటూ సామాజిక కార్యకర్త అయిన కె.శరత్ నిలదీశారు. చంద్రబాబుకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యమైతే పదేళ్లుగా ప్రతిపక్షంలో ఎందుకు ఉండాల్సి వచ్చిందన్నది ఆయన ప్రశ్న. బాబు ధనవంతుల మనిషి అని వామపక్షవాది టీవీ నరసింహారావు ధ్వజమెత్తారు.