పాలకుర్తిలో త్రిముఖ పోటీ
వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో ముగ్గురు ముఖ్యనేతల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది. టీడీపీనుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు , కాంగ్రెస్ నుంచి పీసీసీ అధికార ప్రతినిధి దుగ్యాల శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం.
పాలకుర్తిఅసెంబ్లీ నియోజకవర్గం
ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 5, టీడీపీ - 5, టీఆర్‌ఎస్ -1, పిడిఎఫ్ -1, స్వతంత్రులు -1
ప్రస్తుత ఎమ్మెల్యే: ఎర్రబెల్లి దయాకర్‌రావు (టీడీపీ)
రిజర్వేషన్: జనరల్
నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ సామాజిక చైతన్యం ఎక్కువ. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓటర్లు అధికం.
ప్రస్తుతం బరిలో నిలిచింది: 13
ప్రధాన అభ్యర్థులు వీరే..
ఎర్రబెల్లి దయాకర్‌రావు (టీడీపీ)
దుగ్యాల శ్రీనివాసరావు (కాంగ్రెస్)
ఎన్. సుధాకర్‌రావు (టిఆర్‌ఎస్)
దాసరి యాకయ్య, పాలకుర్తి: ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ ఎలాగైనా గెలవాలని సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఉంది. కాంగ్రెస్ నుంచి మాజీ చైర్మన్ లకావత్ ధన్వంతి భర్త డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో ఎస్టీ వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఈ ఓట్లను లక్ష్మీనారాయణ ఏ మేరకు పొందగలరన్న దానిపై కాంగ్రెస్ అభ్యర్థి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. టీడీపీ ముఖ్యనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మీద కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు రెబెల్‌గా పోటీ చేస్తున్నారు.
ధీమాగా దుగ్యాల
తెలంగాణ ఇచ్చిన పార్టీగా విజయం ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి దుగ్యాల శ్రీనివాసరావు ధీమాగా ఉన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, గెలిస్తే తనకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్దానం దొరుకుతుందన్న ఆశల్లో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు.
ఎర్రబెల్లికి పరీక్ష
టీడీపి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పాలకుర్తి నుంచి గెలుపొందడం ప్రతిష్టాత్మకంగా మారింది. ఐదేళ్లుగా ప్రజలకు, పార్టీ క్యాడర్‌కు అందుబాటులో ఉండి అభివృద్ది చేశానని చెప్పుకుంటున్నారు. సొంత నిధులతో నియోజకవర్గంలో 50 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో అభిమానం వ్యక్తమవుతుందని, ఇది తనకు అనుకూలిస్తుందని ఆశిస్తున్నారు. తెలంగాణలో టీడీపీపై ఉన్న వ్యతిరేకత ఇబ్బందిగా మారింది.
తెలంగాణ తెచ్చామని..
టీఆర్‌ఎస్ చేసిన పోరాటాల వల్లనే తెలంగాణ వచ్చిందన్న విశ్వాసం ప్రజల్లో ఉందని, సునాయాసంగా గెలుస్తానని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకరరావు చెబుతున్నారు. దుగ్యాల, దయాకర్‌రావు ఇద్దరూ స్థానికేతరులన్న అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఆయనకు కలిసివస్తుందన్న అభి ప్రా యం ఉంది. మేనిఫేస్టోలో ప్రకటించిన కార్యక్రమాలు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, నిజాయితీగల నేతగా ఉన్న పేరు సుధాకరరావుకు అనుకూలాంశాలు. ఆయన తండ్రి యతిరాజారావుకున్న ప్రతిష్ట కూడా కలిసిరానుంది.
నే.. గెలిస్తే..
1. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా
2. విద్య, వైద్య, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తా
3.సాగు నీరు. తాగు నీరు అందించేందుకు కృషి చేస్తా.
- ఎన్.సుధాకర్‌రావు, టిఆర్‌ఎస్ అభ్యర్ది.
1. నియోజకవర్గంలోని అన్ని చెరువుల్లోకి దేవాదుల గోదావరి జలాలు తెప్పిస్తా.
2. ఉపాధి అవకాశాలున్న పరిశ్రమలు తీసుకొస్తా.
3.విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు కల్పిస్తా.
- ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ
1. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా పాలకుర్తి.
2. కొడకండ్ల, తొర్రూరు మండలాల్లో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టులు పూర్తి చేయిస్తా,
3.చెన్నూరు. పాలకుర్తి మండలాల్లో రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయిస్తా.
- దుగ్యాల శ్రీనివాసరావు-కాంగ్రెస్