సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు లోక్‌సభ బరిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకరరెడ్డి ఏడు శాసనసభ నియోజకవర్గాల్లోనూ ఎదురీదుతున్నారు. ఆయన పార్టీలో చేరక ముందున్న పరిస్థితితో పోల్చితే ఇప్పుడు టీడీపీ పరిస్థితి తీసికట్టుగా తయారు కావడం ఆయనకు ఆందోళన కలిగి స్తోంది. పార్టీ అంతర్గత సర్వేల్లో గెలుపు అనుమానమేననే ఫలితాలు రావడంతో ఆదాల ఆందోళన మరింత పెరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు రావనే విషయం ఆదాల ప్రభాకరరెడ్డి గుర్తించారు. దీంతో తొలుత వైఎస్సార్ కాంగ్రెస్‌లో ప్రవేశానికి ప్రయత్నించారు. అక్కడి అవకాశం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరు లోక్‌సభ బరిలోకి దూకారు.
ఆదాల పార్టీలోకి రావడానికి ముందు అంతా బాగుంది అనే వాతావరణం కనిపించిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో బలహీనమైన అభ్యర్థులుండటంతో వారిని మార్చుకునే వీలుకూడా చంద్రబాబు ఆయనకు కల్పించారు. ఈ ధీమాతోనే ఆయన పార్టీలో చేరకముందే హడావుడి ప్రారంభించి నామినేషన్ల దాఖలు వరకు ఈ జోష్ కొనసాగించారు. నామినేషన్ల సమయం దగ్గర పడే కొద్దీ సీన్ రివర్స్ కావడంతో ఏం చేయాలో పాలుపోక తన ప్రయత్నం తాను చేస్తాననీ, ఆ తర్వాత భారం దేవుడిదేననే వేదాంత ధోరణికి వచ్చినట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.
పొత్తు భయం
నెల్లూరు లోక్‌సభ పరిధిలో ముస్లిం మైనారిటీ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. వీరిలో కనీసం 50 శాతం ఓట్లు సాధించుకోవచ్చని ఆదాల భావించారు. అయితే బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారు చేసుకోవడంతో ఈ ఓటర్లు పూర్తిగా దూరమయ్యారనే విషయం ఆదాలకు అర్థమైంది. బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటే తమ పుట్టి మునిగినట్లేనని ఆదాల ముందు నుంచి చంద్రబాబుకు తన వాదన వినిపిస్తూనే వచ్చారు. ఒక వేళ పొత్తు ఉన్నా తన లోక్‌సభ పరిధిలో ఒక్క స్థానం కూడా బీజేపీకి ఇవ్వొద్దని కూడా షరతు పెట్టారు. అయితే ఇవేవీ వర్కవుట్ కాకుండా నెల్లూరురూరల్ స్థానం బీజేపీకి దక్కింది. దీంతో ముస్లిం మైనారిటీ ఓట్ల మీద ఆదాల ఆశలు వదులుకున్నారు.
నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి : తెలుగుదేశం పార్టీలోని అంతర్గత విభేదాలు, బలహీనమైన అభ్యర్థుల కారణంగా లోక్‌సభ పరిధిలో ఇబ్బంది తప్పదని ఆదాల అనుయాయులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆత్మకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఢీ కొట్టగల బలం కలిగిన వారు కాదని ఆదాల అంచనా కొచ్చారని తెలిసింది. లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో కూడా బీజేపీకి ఉన్న అన్నో ఇన్ని ఓట్లు కూడా తనకు బదిలీ కావడం అనుమాన మేనని ఆదాల భావిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ లెక్క
కందుకూరు శాసననసభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివి శివరాం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోతుల రామారావును ఢీ కొట్టలేక పోతున్నారు. ఆ నియోజకవర్గం టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన శ్రీనివాసనాయుడు పార్టీకి నష్టం కలిగిస్తారనే ఆందోళన టీడీపీ వర్గాలోనే వ్యక్తం అవుతోంది. శివరాం గెలిస్తే కందుకూరులో శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగుతుందని అక్కడి ప్రజల్లో ఉన్న భయం కూడా ఆదాలకు మైనస్ కానుంది.
కావలి నియోజకవర్గం కచ్చితంగా తమ ఖాతాలో పడుతుందని ధీమాగా కనిపించిన టీడీపీ వర్గాలు ఇప్పుడు డీలా పడ్డాయి. ఆ పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావే తన విజయంపై నిర్వేదంతో మాట్లాడుతుండటం పరిస్థితి కళ్లకు కడుతోంది. ఆదాలకు బలంగా ఉన్న అల్లూరు మం డలం, కావలిపట్టణంలో పట్టుతప్పడం ఆ పార్టీలో కంగారు పుట్టించింది.
ఉదయగిరి టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు పార్టీ కేడర్‌తో కలుపుగోలుగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రామారావు తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అలుకపాన్పు ఎక్కిన కంభం విజయరామిరెడ్డితో పాటు ఆయన వర్గంలోలోన రగిలిపోతోంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి జనంలోకి చొచ్చుకుని పోయే మనస్తత్వం తమ పార్టీకి భారీ గండి కొడుతోందనే విషయం టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు.
ఆత్మకూరు అభ్యర్థి గూటూరు కన్నబాబు బలమైన వ్యక్తి కాదని ఆదాల ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఇక్కడ మరో అభ్యర్థి దొరక్కపోవడంతో ఆయన్నే పోటీ చేయించాల్సి వచ్చింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి జోరు తట్టుకోవడం కన్నబాబుకు సాధ్యం కావడం లేదు.
కోవూరు నియోజకవర్గం టికెట్ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఆదాల పట్టుబట్టి ఇప్పించారు. ఎన్నికల నాటికి ఇక్కడి అంతర్గత విభేదాలు సర్దుబాటు అవుతాయని ఆయన భావించారు. కానీ ఇప్పుడక్కడ పార్టీ అభ్యర్థిని ప్రచారానికే రానివ్వని పరిస్థితి ఉంది. ఈ పరిణామం తమ కొంప కొల్లేరు చేస్తుందనే భయం ఆదాలతో పాటు, పోలంరెడ్డికీ పట్టుకుంది.
నెల్లూరు సిటీలో టికెట్ కోసం పెద్ద యుద్ధమే జరిగింది. పార్టీ హై కమాండ్ జోక్యంతో గొడవలు సర్దుబాటు అయినట్లు కనిపిస్తున్నా లోలోనమాత్రం తమకు ఎసరు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆదాల అనుమానిస్తున్నారు. పోలింగ్ రోజు అసమ్మతి బృందం కాడి దించేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్‌కు కలిసొస్తుందని టీడీపీ అంతర్గత సర్వేలు తేల్చాయి.
నెల్లూరు రూరల్ బీజేపీకి ఇవ్వడంతో అక్కడ వైఎస్సార్ సీపీకి సరైన పోటీ కూడా ఇవ్వలేక పోతున్నామని ఆదాల అంచనా వేస్తున్నారు. అందుకే తనకైనా ఓట్లు సాధించుకోవడం కోసం అంతర్గత రాజకీయం చేసుకుంటున్నారు.
ఆదాలకు ఎదురీతే
Published Fri, May 2 2014 1:51 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement