సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్ల రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్‌లో గ్రూపుల అధిపత్య పోరుకు ఈ నియోజకవర్గం కేంద్ర బిందువైంది. స్థానిక పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి, రాజకీయ ఉద్దండుడు సూదిని జైపాల్‌రెడ్డి మార్క్ రాజకీయం నాయకుల మధ్య కొత్త పంచాయితీకి తెరలేపింది. ఈసారి ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీకి దిగనని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆశావహుల మధ్య పోటీని మరింత పెంచింది. వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంటరీ స్థానానికి పోటీచేయాలని జైపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో సంప్రదింపులు జరుపుతున్న ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి కూడా తెలియజేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. తాను ఖాళీ చేసే సీటును తాను సూచించిన వారికేఇవ్వాలన్న ఆయన ప్రతిపాదన జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతికి ఆజ్యం పోసింది. తన ముఖ్య అనుచరుడు, సీనియర్ నేత ఉద్దెమర్రి నరసింహారెడ్డికి మేడ్చల్ అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు జైపాల్‌రెడ్డి పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. 2009లో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి చివరి నిమిషంలో ఇక్కడి నుంచి టికెట్ ఖరారుకావడంతో ఉద్దెమర్రికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఉద్దెమర్రికి సీటిప్పించాలని జైపాల్‌రెడ్డి దృఢనిశ్చయంతో ఉన్నారు.
మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి మారుతున్నందున.. తన స్థానంలో చేవెళ్ల నుంచి బరిలోకి దిగాలని కేఎల్లార్‌కు జైపాల్ సూచిస్తున్నారు. తద్వారా ఉద్దెమర్రికి లైన్‌క్లియర్ చేయడంతోపాటు కేఎల్లార్‌కు ప్రత్యామ్నాయం కూడా చూపినట్లవుతుందని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే కేఎల్లార్‌ను ఒప్పించేందుకు మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను జైపాల్‌రెడ్డి రంగంలోకి దించారు. తన ప్రతిపాదనను అంగీకరించేలా కే ఎల్లార్‌కు నచ్చజెప్పాలని సూచించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ప్రసాద్.. కేఎల్లార్‌తో సంప్రదింపులు జరిపినా ఆశించిన ఫలితం కనిపించడం లేదని సమాచారం.
జైపాల్ ప్రతిపాదనకు ససేమిరా
అయితే, జైపాల్ రాజీ ఫార్ములాకు కేఎల్లార్ ససేమిరా అన్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లోనూ తాను మేడ్చల్ శాసనసభా స్థానం నుంచే బరిలో ఉంటానని స్పష్టం చేసినట్లు తెలిసింది. రెండు నెలల క్రితమే తాను అడిగినప్పుడు ఇక్కడి నుంచే(చేవెళ్ల) పోటీచేస్తానని చెప్పి.. ఇప్పుడు పాలమూరు ఫిఫ్ట్ అవుతున్నానని చెప్పడం ఎంతవరకు సబబని నిలదీసినట్లు తెలిసింది. ప్రచారానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో జైపాల్ ప్రతిపాదనకు అంగీకరించేదిలేదని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా మేడ్చల్ నుంచే పోటీచేస్తాను తప్ప.. ఒకరి కోసం సిట్టింగ్ సీటును వదులుకునే ప్రసక్తేలేదని ఘాటుగా బదులిచ్చినట్లు తెలిసింది.
డైలమాలో చెల్లెమ్మవర్గం!
చేవెళ్ల లోక్‌సభ టికెట్ రేసులో ఉన్న మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కుటుంబానికీ జైపాల్‌రెడ్డి వ్యవహారశైలి మింగుడుపడడంలేదు. 2009లో తమకు దాదాపు గా ఖరారైన టికెట్‌ను ఎగురేసుకుపోయిన జైపాల్.. ఇ ప్పుడు తన శిష్యుడి కోసం కేఎల్లార్‌ను తెరమీదకు తేవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి పోటీకి సన్నాహాలు చేసుకుంటుండడంతో తమ కు లైన్‌క్లియరైందని భావించిన సబిత, తనయుడు కార్తీక్‌రెడ్డికి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
‘చేవెళ్ల’ చిక్కుముడి!
Published Sun, Mar 23 2014 11:34 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement