'శత్రుఘ్న సిన్హా పై పోటీకి దిగడమే నేను చేసిన తప్పు'
పాట్నా: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది కాదనలేని వాస్తవం. ఈ వాస్తవాన్ని మరోసారి నిజం చేశారు బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా. ప్రస్తుతం పాట్నా సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గా బరిలో దిగిన శత్రుఘ్న సిన్హా తన సహచర నటుడు,గత ప్రత్యర్థి శేఖర్ సుమన్ ను కలిశారు. శేఖర్ సుమన్ తల్లి ఉషా ప్రసాద్ 80 వ జన్మదిన వేడుకలకు హాజరైన శత్రుఘ్న సిన్హా ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం శత్రుఘ్న మీడియాతో మాట్లాడుతూ.. 'నాకు తల్లి లేదు. ఉషా ప్రసాద్ ను తల్లిగా భావించి ఆమె దీవెనలు పొందడానికి వెళ్లాను. అయినా మా రెండు కుటుంబాల మధ్య విడదీయరాని బంధం ఉంది' అని తెలిపారు. గత 2009 ఎన్నికల్లో శత్రుఘ్నపై పోటీ చేసి శేఖర్ సుమన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
'మా కుటుంబాల మధ్య వ్యక్తిగతంగా విభేదాలు ఏమీ లేవని, ఆ ఎన్నికల్లో పోటీ చేయడమే మా కుటుంబాల్ని దూరం చేసిందని, ఆనాటి ఎన్నికల్లో శత్రుఘ్నపై పోటీ చేయడమే ఒక తప్పిదమని' శేఖర్ సుమన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మరోమారు తన చాణక్య బుద్ధిని చూపేంచేందుకు యత్నించి శత్రుఘ్నపై పోటీ చేయమని ఆదేశిందన్నారు. కాగా, తాను మాత్రం ఈసారి ఎటువంటి తప్పిదాలు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు.