తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆయన్ను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పరిచయం చేసి పార్టీ కండువా కప్పించారు. వంటేరు రాకతో ఉదయగిరి, కావలి నియోజక వర్గాల్లో వైఎస్సార్‌సీపీకి అదనపు బలం తోడైంది.
తెలుగుదేశం పార్టీ నుంచి 1999లో కావలి ఎమ్మెల్యేగా ఎన్నికైన వేణుగోపాల్‌రెడ్డి తొలి నుంచి పార్టీకి విధేయుడిగా పనిచేస్తూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీద నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి అభ్యర్థి దొరకని సమయంలో వేణుగోపాల్‌రెడ్డి టీడీపీ తరఫున బరిలోకి దిగారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో సైతం టీడీపీకి వంటేరే దిక్కయ్యారు.
ఆ తర్వాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన సర్వేపల్లి శాసనసభ్యుడు ఆదాలప్రభాకర్‌రెడ్డి నెల్లూరు లోక్‌సభకు బరిలోకి దిగాలని నిర్ణయించారు. దీంతో కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆయనకు, పార్టీకి తన అవసరం ఉండటంతో వంటేరుకు తగిన ప్రాధాన్యత దక్కుతుందని భావించారు. పార్టీ అధినేత చంద్రబాబు పెత్తనం మొత్తం ఆదాలకే అప్పగించడాన్ని వంటేరు జీర్ణించుకోలేకపోయారు. ఇదే సమయంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్వయంగా వంటేరును కలసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఆయన వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయం తెలిసి టీడీపీ ముఖ్యనేతలు వంటేరును నిలువరించే ప్రయత్నం చేసినా ఆయన ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వైఎస్ జగన్ చేతులమీదుగా ఆయన వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వంటేరుకు ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, జలదంకి మండలాల్లోను, కావలినియోజకవర్గంలోని కావలి, బోగోలు మండలాల్లోను అనుచరవర్గం, జనంలో పట్టు ఉంది. ఈయన రాకతో వైసీపీకి రెండు నియోజకవర్గాల్లో అదనపు బలం చేకూరనుంది.