ఏజెన్సీ దేశం అథోగతి!
- నిలువునా చీలిపోయిన శ్రేణులు
- పోటాపోటీగా సమావేశాలు
- సోమ బుజ్జగింపులకు ససేమిరా
- అధిష్టానం నిర్ణయంపై రగిలిపోతున్న తమ్ముళ్లు
హుకుంపేట, న్యూస్‌లైన్: ఏజెన్సీలో తెలుగుదేశంపార్టీ పరిస్థితి బాగోలేదు. అరకు నియోజక వర్గంలో శ్రేణులు నిట్టనిలువునా చీలిపోయాయి. పాడేరును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఎన్నడూ లేనివిధంగా శివాలెత్తిపోతున్నారు. ఇక్కడ టీడీపీ నేతలు ప్రసాద్,సుబ్బారావుల్లో ఒకరు దారికివచ్చినా సుబ్బారావు తిరుగుబాటుదారుడిగానే మిగిలిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి లోకులగాంధీకి ముచ్చెమటలు పడుతున్నాయి. అరకులోయలో ఒకే పార్టీలో ఇద్దరికి బి-ఫారాలు ఇవ్వడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
టీడీపీ రెబల్‌గా నామినేషన్ వేసిన కుంబా రవిబాబును బరిలో కొనసాగించి తాడోపేడో తేల్చుకోవడానికి సి ద్ధపడుతున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలతో హుకుంపేట మండలం కొంతలిలో మంగళవారం భారీ సమావేశం ఏర్పాటు చేశా రు. అంతకు ముందు ఆయా మండలాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులతో భవిష్యత్ కార్యక్రమంపై రవిబా బు చర్చించారు. పోటీలో నిలిచి అధిష్టానానికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సమావేశంలో వివిధ నాయకుల ప్రసంగాలూ దీనినే ప్రస్పుటం చేశాయి. ఆ సమావేశానికి పోటీగా అదే సమయంలో హు కుంపేటలో టీడీపీ అభ్యర్థి సీవేరి సోమ మరో సమావేశం నిర్వహించారు. దీంతో నియోజవర్గంలోని ఆ పార్టీ కార్యకర్తలు చెరిసగంగా చీలిపోయినట్టయింది. ఇంతకాలం అం తర్గతంగా ఉన్న పార్టీలోని విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి.
రవిబాబును బుజ్జగించేందుకు అధిష్టానం సోమవారం చేపట్టిన ప్రయత్నమూ విఫలమైంది. ఆయనను కలిసేందుకు వచ్చిన జిల్లా నాయకుడు లాలం భాస్కరరావుకు చేదు అనుభవం ఎదురయింది. రవిబాబు మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది జరిగి న మరునాడే నియోజకవర్గం టీడీపీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. సగానికిపైగా టీడీపీ నాయకులు రవిబా బు వద్దకు వెళ్లిపోయారు. హుకుంపేట మండలానికి చెంది న బాకూరు వెంకటరమణరాజు, కంబిడి రాంబాబు, మజ్జిరత్నాలమ్మ, సూర్యకాంతం, మామిడి కాంతమ్మ, సుమన్, దొరలతో పాటు పలువురు నాయకులు రవిబాబుకు మద్ద తు పలుకుతూ ఆయన వెంట వెళ్లగా శెట్టి లక్ష్మణుడు, పాడి బాలన్న, పొండోయి లక్ష్మయ్య, సుర్రా వెంకటరావు, బురి డి సాంబ, గాసన్నలు టీడీపీ అభ్యర్థి సీవేరి సోమ వెంట నడిచేందుకు సిద్ధపడ్డారు.
కాగా రవిబాబు వర్గం నాయకులను బుజ్జగించేందుకు మంగళవారం అభ్యర్థి సోమ మం డల కేంద్రం డుంబ్రిగుడ వచ్చారు. ఇరు వర్గాల మధ్య సు మారు గంటపాటు ఘర్షణపూరిత వాతావరణం చోటుచేసుకొంది. అధిష్టానం సస్పెండ్ చేసినా పార్టీ అభ్యర్థికి సహకరించేది లేదంటూ పలువురు తెగేసి చెప్పడంతో సోమ నిరాశతో వెనుతిరిగారు. ఈ పరిణామం నియోజకవర్గంలో పార్టీకి తీరని లోటని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నియోజకవర్గంలో కాంగ్రేస్ ఖాళీ
అరకు రూరల్ : అరకు అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రేస్ పార్టీ ఖాళీ అయిపోతోంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించినప్పటికీ ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు నామమాత్రం. అలాగే ఆ పార్టీలో ఉంటే భవిష్యత్ లేదనో ఆ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అరకులోయ మండల కాంగ్రేస్ అధ్యక్షునిగా పనిచేసిన శెట్టి వెంకటరావు, రెండుసార్లు ఎంపీటీసీగా వ్యవహరించిన బూర్జ సుందర్‌రావు,పెదలబుడు ఒకటో సెగ్మెంట్ మాజీ ఎంపీటీసీ శెట్టి బుట్టి ఇటీవల కిడారి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కొత్తూరు సర్పంచ్‌గా గెలిచిన దుడ్డు సోములు, డుంబ్రిగుడ జెడ్పీటీసీగా పోటీ చేసిన చినబాబు కిడారి వర్గంలో చేరారు.