సోషల్ మీడియా ప్రభావం..
అమెరికలాంటి అగ్ర దేశంలోని ఎన్నికలతోపాటు మనదేశ జాతీయ రాజకీయాల్లోనూ ఇప్పటికే విస్తృతంగా కొనసాగుతున్న సోషల్ మీడియా ప్రచారం యువతపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. యువతను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంతో యువత రాజకీయ చైతన్యం పొందే అవకాశాలు లేకపోలేదు. స్మార్ట్‌ఫోన్‌ల పుణ్యమాని నేటి యువత సోషల్ నెట్‌వర్క్ సైట్‌లను అధికంగా ఉపయోగించుకుంటుండంతో.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. సెల్‌ఫోన్‌లలో యువత ఎక్కువగా ఉపయోగించే ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రాం, అప్లికేషన్‌ల ద్వారా పబ్లిసిటీ మొదలుపెట్టారు.
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న యువ అభ్యర్థులు తాము పోటీ చేసే వార్డుతోపాటు తాము పోటీ చేస్తున్న పార్టీ గురించి సైతం సోషల్ నెట్‌వర్క్ సైట్లలో పొందుపరుస్తున్నారు. తమ బయోడేటా మొదలుకొని పార్టీ కార్యక్రమాల్లో తాను పాల్గొంటున్న ఫొటోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసుకుంటూ లైక్‌లు, షేరింగ్, కామెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాపై పెద్దగా అవగాహన లేని సీనియర్ అభ్యర్థులు సైతం తమ కుటుంబంలో లేదా తన వర్గానికి చెందిన యువకుల సహకారంతో తమ అకౌంట్స్‌ను నిర్వహిస్తున్నారు. తద్వారా వారు ఓటర్లకు చెప్పాలనుకున్న సమాచారాన్ని అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ఒక్క క్షణం ఆలోచించండి..
నోటుకు ఓటు అమ్ముకునే వారు కొందరైతే తమకేమస్తుందని అసలు ఓటు హక్కునే వినియోగించుకోని వారు మరికొందరు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువత సైతం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మన తలరాతను నిర్దేశించే వారిని ఎన్నుకునే ఈ సమరంలో మన అభ్యున్నతికి పాటుపడే యువ నాయకులను గెలిపించుకునే అవకాశాన్ని వదులుకోకుండా ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించాల్సిన అవసరం ఉంది. యువత నడుం బిగించి ఓటర్లను చైతన్యవంతం చేసి వంద శాతం ఓటు హక్కును వినియోగించుకునేలా చేయాలి. అవినీతి రహిత నవశకానికి పునాది వేయాలి.
ఫేస్‌బుక్ యుద్ధాలు..
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమే. ఇది పైస్థాయి నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాను విపరీతంగా ఉపాయోగిస్తున్న పార్టీలు దాని ద్వారా విమర్శలు గుప్పించుకుంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక పార్టీ పోస్టు చేస్తుండగా, మరో పార్టీ వారు తమతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గొప్పగా పోస్టు చేసుకుంటున్నారు. ఆయా పార్టీలకు అభిమానులుగా ఉండే సభ్యులు ఈ పోస్టులకు బాగా స్పందించి లైక్‌లు, కామెంట్‌లు, షేర్‌లు చేస్తున్నారు. అయితే పక్క పార్టీలకు చెందిన అభిమానులు ఒక్కోసారి ప్రత్యర్తి పార్టీల పోస్టులపై వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ అభిమానులను రెచ్చగొడుతున్నారు. దీంతో ఇరు పార్టీల అభిమానులు కామెంట్‌లతో గొడవలకు దిగుతున్నారు.
రాజకీయాలపై సోషల్ మీడియా ప్రచార ప్రభావం
Published Fri, Mar 21 2014 3:03 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM
Advertisement