సోషల్ మీడియాపై క్రేజ్ పెరిగింది..!
సోషల్ మీడియా స్థాయి మరింత పెరిగిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. యూకేకు చెందిన ఓ జర్నలిస్ట్ సంస్థ యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా లోని 26 దేశాలలోని ఆన్ లైన్ యూజర్లపై చేసిన అధ్యయనంలో కొన్ని వాస్తవాలను గ్రహించారు. సోషల్ మీడియా వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ తో పాటు వాట్సాప్, స్నాప్ చాట్ లాంటి వాడకం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. వార్తలు, తాజా విశేషాల కోసం సోషల్ మీడియా సైట్ల వాడకం విపరీతంగా ఉందని రీసెర్చర్స్ పేర్కొన్నారు.
అయితే గతంలో కేవలం ఫొటోలు పోస్ట్ చేయడం, తమ బంధువులు, మిత్రులతో చాటింగ్ చేయడానికి మాత్రమే వినియోగించేవారు. ప్రస్తుతం ఆన్ లైన్ యూజర్లలో సగానికంటే ఎక్కువ మంది రోజువారీ వార్తలు, అప్ డేట్స్ కేవలం సోషల్ మీడియా నుంచి తెలుసుకుంటున్నారు. న్యూస్ చానల్స్ చూడటం, దినపత్రికలు చదవడం తగ్గిపోయినట్లు అధ్యయనంలో వెల్లడైంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న వారు పనిలో పనిగా న్యూస్ అప్ డేట్స్ తెలుసుకుంటున్నారని, దీంతో వార్త మాధ్యమాలకు దూరంగా ఉంటున్నారు.
స్వీడన్ లో 69 శాతం యూజర్స్, కొరియాలో 66శాతం మంది, స్విట్జర్లాండ్ లో 61 శాతం యూజర్స్ వార్తల కోసం సోషల్ మీడియాను వినియోగిస్తు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఫేస్ బుక్ ద్వారా 44 శాతం యూజర్స్, యూట్యూబ్ ద్వారా 19 శాతం, ట్విట్టర్ ద్వారా 10 శాతం యూజర్స్ రోజువారి కార్యక్రమాలు, జరుగుతున్న సంఘటనలను తెలుసుకుంటున్నారు. ఆసియా, ఆఫ్రికాలోని దేశాలలో స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వాళ్లలో ఎక్కువ మంది వార్తల కోసం సోషల్ మీడియాపై ఆధార పడుతున్నారని యూకే సంస్థ వివరించింది.