రూటు మార్చిన రాములమ్మ
నియోజవర్గం మారబోనని బెట్టుచేసింది. అవసరమైతే పార్టీ మారడానికైనా రెడీ అయిపోయింది. తన పంతం నెగ్గించుకునేందుకు 'అన్న'ను సైతం ఎదిరించి కాంగ్రెస్ కండువా కప్పుకుంది. ఏమైతేనేం చెల్లెమ్మ మళ్లీ అదే స్థానం నుంచి టికెట్ సంపాదించింది. అన్న కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగుతున్నాడు. కాకపోతే చెల్లెమ్మ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రూటు మార్చింది. దీంతో ఇద్దరి మధ్య ముఖాముఖి పోరు తప్పింది. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కలసిమెలసి పనిచేసిన అన్నాచెల్లెళ్లు ఈసారి'మెదక్మే సవాల్' అంటూ వైరి వర్గాలుగా తలపడుతున్నారు. రాజకీయమంటే ఇదే మరి! అభిమానులు రాములమ్మగా పిలుచుకునే విజయశాంతి కథ ఇది.
గత లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున విజయశాంతి మెదక్ నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయశాంతి విజయానికి కృషి చేశారు. మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ విజయం సాధించడంతో ఇద్దరూ పార్లమెంట్కు వెళ్లారు. రాములమ్మను సొంత చెల్లెలుగా ఆదరించిన కేసీఆర్ ఆమెకు పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఐదేళ్లు తిరిగేసరికి పరిస్థితి మారిపోయింది. అన్నాచెల్లెళ్ల బంధం చెడింది. దీనికి కారణం మెదక్ పార్లమెంట్ సేటే! కేసీఆర్ తాజా ఎన్నికల్లో సొంత జిల్లా నుంచి పోటీ చేయాలని భావించడంతో రాములమ్మకు టిక్కెట్ హామీ లభించలేదట. దీంతో ఆమె నియోజకవర్గం మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాను మెదక్ నుంచే పోటీ చేస్తానంటూ విజయశాంతి ధిక్కార స్వరం వినిపించింది. కాంగ్రెస్ పార్టీ గాలం వేయడంతో కారు దిగిపోయింది.
మెదక్ టికెట్ కోసం కాంగ్రెస్లో చేరిన విజయశాంతి అదే చోట నుంచి అయితే బరిలో దిగుతున్నారు కానీ లోక్సభకు కాదు. ఈసారి ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ జాబితాలో విజయశాంతి పేరును ప్రకటించారు. రాములమ్మ చివరకు ఢిల్లీ కంటే హైదరాబాదే బెటరనుకుందో లేక సర్దుకుపోయిందో? ఇక కేసీఆర్ కూడా ఈసారి సొంత జిల్లాకు మారారు. మెదక్ లోక్సభ నుంచి పోటీచేస్తున్నారు. దీంతో మెదక్ పోరు ఆసక్తికరంగా మారింది. అన్నాచెల్లెళ్లు నేరుగా తలపడకపోయినా ఒకే నియోజకవర్గం నుంచి వేర్వేరు చట్టసభలకు పోటీ చేస్తున్నారు. వైరి పక్షాలుగా మోహరించి మాటల తూటాలు పేల్చనున్నారు. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!