'ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన ఘనత బాబుది'
ఒంగోలు : ఓటు వేసే ముందు ఒక్కసారి వైఎస్‌ఆర్‌ను గుర్తుకు తెచ్చుకోవాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల శనివారం ప్రకాశం జిల్లా అద్దంకిలో పర్యటించారు. షర్మిలకు అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమెకు బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రైతులను రాజులా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు. వైఎస్ఆర్ రైతుల పక్షపాతి అని,ఆయన హయాం...రైతుల పాలిట స్వర్ణయుగమని ఆమె గుర్తు చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్తో పేదలకు పెద్ద చదువులు అందయని షర్మిల తెలిపారు. చంద్రబాబు 16లక్షల మందికి పింఛన్లు ఇస్తే... వైఎస్‌ఆర్ 71లక్షల మందికి పింఛన్లు ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని షర్మిల అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కిరణ్ సర్కార్ వైఎస్ పథకాలకు తూట్లు పొడిచిందని ఆమె మండిపడ్డారు. పిల్లనివ్వటమే కాకుండా, రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన ఘటన చంద్రబాబుదన్నారు. హార్స్ పవర్ ఛార్జీని రూ.50 నుంచి 600 చేసిన ఘనుడు చంద్రబాబు అని షర్మిల ధ్వజమెత్తారు.
మన భవిష్యత్‌ను మనమే నిర్ణయించుకుందామని షర్మిల అన్నారు. ప్రధానమంత్రి కుర్చీలో ఎవరు కుర్చోవాలో మనమే నిర్ణయిద్దామని ఆమె అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నూతన అధ్యాయం నిర్మించుకుందామని, ప్రజల సంక్షేమం కోసం జగనన్న తన జీవితాన్ని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసి...మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని షర్మిల పిలుపునిచ్చారు.