
ప్రొద్దుటూరులో.. ఫ్యాన్ హోరు
మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వరద
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రజా సేవలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తొలిమారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీ చేస్తున్న రాచమల్లు ప్రసాదరెడ్డికే స్థానిక పరిస్థితుల దృష్ట్యా విజయావకాశాలు మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 16 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఈయన కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, ఇన్‌చార్జి చైర్మన్‌గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యావంతుడు కావడం.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం రాచమల్లుకు లాభించే అంశాలు.
సమీప ప్రత్యర్థిగా ఉన్న నంద్యాల వరదరాజులరెడ్డి పాతికేళ్లు ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి నిరోధకుడుగా ప్రజల మనసుల్లో ముద్రవేసుకున్నారనే భావన ప్రజల్లో ఉంది. ఈ కారణంగానే 2009 ఎన్నికల్లో లింగారెడ్డి చేతిలో 16,156 ఓట్లతో వరద ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవగుడి నారాయణరెడ్డి చేతిలో ఓటమి పాలైన వరద ప్రస్తుతం మరో మారు ఎమ్మెల్యే ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ చేస్తున్నారు.
వరదకు ఎదురుగాలి...
2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వరద ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ పొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ఎన్నికల్లో జి ల్లాలోని 10 అసెం బ్లీ నియోజకవర్గాలకు గాను ప్రొద్దుటూరులో మాత్రమే వరదరాజులరెడ్డి కాంగ్రెస్‌పార్టీ తరపున ఓటమి చెందారు. ఇది లావుండగా 1981లో రాజకీయ రంగ ప్రవే శం చేసి సమితి ఎన్నికల్లో పోటీ చేయగా శెట్టిపల్లె రఘురామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీ రమణారెడ్డి చేతిలో వరదరాజులరెడ్డి ఓటమి పాలయ్యారు. 1985, 1989, 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అలాగే 1981లో తొలిమారు సమితి ప్రెసిడెంట్, 1983లో, 2009లో ఎమ్మెల్యేగా, 2011లో ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ప్రకారం వరద జీవితంలో మొత్తం 5 మార్లు గెలుపొందగా, మరో నాలుగు మార్లు ఓటమిపాలయ్యారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు వరదకు ప్రతికూలంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు వీరే...
సంవత్సవం పార్టీ గెలుపొందిన అభ్యర్థి
1952 కాంగ్రెస్ కె. బాలనారాయణరెడ్డి
1955 కాంగ్రెస్ కె. బాలనారాయణరెడ్డి
1957 ఇండిపెండెంట్ ఆర్‌సీ ఓబులరెడ్డి
1962 కాంగ్రెస్ ఆర్. రామసుబ్బారెడ్డి
1972 కాంగ్రెస్ కొప్పరపు సుబ్బారావు
1978 కాంగ్రెస్. ఐ చంద్ర ఓబులరె డ్డి రామిరెడ్డి
1983 టీడీపీ ఎం.వీ రమణారెడ్డి
1985 టీడీపీ ఎన్. వరదరాజులరెడ్డి
1989 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి
1994 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి
1999 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి
2004 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి
2009 టీడీపీ మల్లెల లింగారెడ్డి
పట్టణ ఓటర్లే కీలకం..
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2,20,000 వరకు ఓటర్లు ఉండగా ఇందులో పట్టణంలోనే 1,23,000 మంది ఓటర్లు ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటములు ప్రధానంగా ప్రొద్దుటూరు పట్టణంపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ప్రొద్దుటూరు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పాతికేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వరద ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని, పెపైచ్చు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాగునీటి కోసం మంజూరు చేసిన కుందూ-పెన్నా నీటి పథకాన్ని పూర్తి చేయలేకపోయారనే అపవాదు ప్రజల్లో ఉంది. అలాగే ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. వీటికి తోడు పట్టణంతోపాటు నియోజకవర్గంలో ప్రజలకు కనీసం మౌలిక వసతులు సమకూర్చడంలో విఫలమయ్యారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి అంశాలు ఎక్కువగా వరద ఓటమికి ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ కారణంగా తొలిమారు బలమైన పార్టీ తరపున పోటీ చేస్తున్న రాచమల్లు ప్రసాదరెడ్డినే విజయం వరిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఇదిలావుండగా ప్రొద్దుటూరులో అప్పుడే రాచమల్లు ప్రసాదరెడ్డి మెజారిటీపై బెట్టింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆయన ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.