ప్రియాంక చోప్రా
హాలీవుడ్ చిత్రాలు, టీవీ సీరియళ్ల కోసం గత రెండున్నరేళ్లుగా విదేశాల్లో ఉంటున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆఖరి నిముషంలో అప్రతిష్టను మూటగట్టుకుని భారత్‌కు బయల్దేరి వస్తున్నారు! అమెరికన్ టెలివిజన్ డ్రామా థ్రిల్లర్ ‘క్వాంటికో’లో సి.ఐ.ఎ ఏజెంటుగా నటిస్తున్న ప్రియాంకను ఆ సీరీస్ తాజా ఎపిసోడ్ ‘ది బ్లడ్ ఆఫ్ రోమియో’లోని ఒక సన్నివేశం ఆమె ఊహించని విధంగా ‘దేశద్రోహి’గా నిలబెట్టింది! న్యూయార్క్‌పై అణ్వాయుధ దాడి చేయబోతున్న ఒక పాకిస్తానీ.. ప్రియాంకకు పట్టుబడినప్పుడు ఆ ఉగ్రవాది మెడలో రుద్రాక్షమాల బయటపడుతుంది! దర్యాప్తులో అతడొక దారితప్పిన భారతీయ ప్రొఫెసర్ అని తేలుతుంది. అయితే ఈ సన్నివేశంలో నటించడం ద్వారా ప్రియాంక.. భారతీయుల మనోభావాలను దెబ్బతీశారని, భారతీయులంటే ఉగ్రవాదుల అన్న భావన ప్రపంచ దేశాల్లో కలగడానికి ఆమె కారణం అయ్యారని జాతీయవాదులు మండిపడుతున్నారు. ‘‘భారతీయుల అభిమానం వల్ల స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు భారతీయులనే అవమానిస్తున్నావా ప్రియాంకా..?’’ అని ట్వీట్‌లు కూడా మొదలయ్యాయి.
ఆన్‌లైన్‌లో ఈ నిరసనలు, ఆగ్రహ జ్వాలలు ‘క్వాంటికో’ను ప్రసారం చేస్తున్న ఎ.బి.సి.కి (అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ) తాకడంతో డిస్నీ నెట్‌వర్క్ సంస్థ అయిన ఎ.బి.సి. వెంటనే భారతీయులను క్షమాపణ కోరుతూ ‘వాషింగ్టన్ పోస్టు’కు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ప్రధానంగా ప్రియాంక నిర్దోషి అని చెప్పడానికే ఎ.బి.సి. ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది. ‘‘ఆ సన్నివేశానికి మనసు నొచ్చుకున్న మా వీక్షకులకు మా స్టూడియోతో పాటు, ‘క్వాంటికో’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూజర్లూ క్షమాపణ కోరుతున్నారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాలన్న ఆలోచన ప్రియాంకది కాదు. స్క్రిప్టు, డైరెక్షన్ కూడా ఆమెవి కావు. స్టోరీ లైన్‌లో కానీ, క్యాస్టింగ్‌లో కానీ ఆమె ప్రమేయం లేదు. పూర్తిగా కల్పితం అయిన ఈ సీరీస్‌లోని సన్నివేశంలో అనుకోకుండా ఇలా కొందరి మనసులు గాయపడ్డాయి’’ అని ఎ.బి.సి. క్షమాపణతో పాటు, వివరణ కూడా ఇచ్చింది. లో రేటింగ్స్ రావడంతో ఇటీవల కొంతకాలం ‘క్వాంటికో’ ఆగి, మొదలైంది. త్వరలో ముగియబోతోంది కూడా. దాంతో జూౖలñ లో షూటింగ్ మొదలు కాబోతున్న ‘భరత్’ చిత్రం (సల్మాన్‌ఖాన్ హీరో)లో హీరోయిన్‌గా నటించడానికి ప్రియాంక ఇండియా బయల్దేరబోతుండగా ఈ వివాదం చుట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment