‘జంకు’.. గొంకూ వద్దు! | Avoid Junk Food And Be Healthy | Sakshi
Sakshi News home page

‘జంకు’.. గొంకూ వద్దు!

Published Mon, Jul 22 2019 9:29 AM | Last Updated on Mon, Jul 22 2019 9:32 AM

Avoid Junk Food And Be Healthy - Sakshi

సాక్షి, విజయనగరం: ప్రస్తుతం జీవనం యాంత్రికమైపోయింది. ఉద్యోగ బాధ్యతలతో వాయువేగంతో సాగిపోతోంది. ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా శారీరక శ్రమకు దూరమవుతున్నారు. తినేది జంక్‌ ఫుడ్‌ అని.. ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసినా.. ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒకటి తిని సరిపెడుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లే సమయం లేక, మరికొందరు ఇంకోరోజు చేద్దాంలే అని వాయిదాలు వేస్తున్నారు.

మారిన ఆహారపుటలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో కేలరీలు కరగకపోగా, కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ఇందుకోసం బరువులు ఎత్తడం, జిమ్‌లకు వెళ్లడం, కిలోమీటర్ల నడక లాంటివే కాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంటి పనులు చేయడం.. వ్యాయామంతో సమానమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మానసిక ప్రశాంతత లభించడంతోపాటు.. తెలియకుండానే శారీరక శ్రమ పెరిగి రెండు రకాలుగా ఉపయోగాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

కాసేపు తోట పని చేస్తూ.. 
ఎవరి పనులే వారే చేసుకోవడం ఉత్తమం. ఇంటి తోటలో మొక్కలను నాటడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయడం, బాగా పెరిగిన ఆకులు, కొమ్మలను కత్తిరించడం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజు 40 నిమిషాలపాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200 పైగా కేలొరీలు తగ్గించుకోవచ్చు. చెట్లు, పచ్చదనం మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి.

లిఫ్ట్‌కు దూరంగా..
భవనాల్లో వారి ఇంటికో, కార్యాలయానికో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్‌ ఆశ్రయిస్తుంటారు. ఈ విధానానికి చెక్‌ పెట్టాలి. సాధ్యమైనంత వరకు మెట్లు ఎక్కే ప్రయత్నం చేయాలి. కనీసం ఒకటి రెండు అంతస్తులనైనా ఎక్కేందుకు ప్రయత్నం చేస్తే సుమారు 200 కేలొరీల వరకు కొవ్వు కరుగుతుంది. 

సైకిల్‌ని వినియోగించడం
సైకిల్‌ తొక్కడం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్క రోజైనా రోడ్లపై సైకిల్‌ తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు ఎక్కువ మంది ద్విచక్ర వాహనాలను వినియోగిస్తుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా సైకిల్‌పై వెళ్తే మంచిది. రోజూ అర్ధగంటపాటు సైకిల్‌ తొక్కితే దాదాపు 210 కేలొరీలు తగ్గించుకున్నట్టే. నలభై నిమిషాలపాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలొరీలు కరుగుతాయట. రోజంతా ఒకే చోట కూర్చొని పనిచేసే వారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇంటిని శుభ్రం చేయడంతో..
ఖాళీ సమయాల్లో బయటికెళ్లే పని లేకపోతే ఇంట్లోనే ఉండి దుమ్ము దులపడమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు గదుల్లో పట్టిన బూజును శుభ్రం చేస్తే ప్రయోజనం ఉంటుంది. రోజూ 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే 128 కేలొరీల కొవ్వును కరిగించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేస్తే, ఇల్లు శుభ్రపడటంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

స్కిప్పింగ్‌తో.. 
ఇంటిలో ఉదయం పూట, వాకింగ్‌ చేసే మైదానంలో రోజూ కాసేపు స్కిప్పింగ్‌ చేయండి. పది నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతుతూ స్కిప్పింగ్‌ చేస్తే వందకుపైగా కేలొరీలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.  

నృత్యంతో..
సంగీతం వినిపిస్తే కాళ్లు, చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృత్యం చేస్తే మేలు. చెమట చిందించడంతో పాటు కొవ్వు కరిగే అవకాశం ఉంది. ఇరవై నిమిషాలపాటు నృత్యం చేస్తే 100 నుంచి 120 వరకు కేలొరీలు తగ్గించుకోవచ్చు. నాట్యం చేశామనే తృప్తి, ఆనందం మిగులుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement