చూపులేని వారి చుక్కాని | Blind to their rudder | Sakshi
Sakshi News home page

చూపులేని వారి చుక్కాని

Published Tue, Mar 24 2015 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

చూపులేని వారి చుక్కాని

చూపులేని వారి చుక్కాని

యాదేశ్వరి అంధురాలు కాకపోయినా బ్రెయిలీ లిపిని ఇష్టంగా నేర్చుకున్నారు. బ్రెయిలీలో పుస్తకాలు అచ్చు వేయించి అంధ విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. ఇతర అంధులకు సైతం తన పుస్తకాల ద్వారా దైవచింతన, ఆధ్యాత్మికత  కలిగిస్తున్నారు. ఇప్పటికి ఆరొందలకు పైగా పుస్తకాలను ముద్రించి పంచిపెట్టారు. మరి యాదేశ్వరిని ఇలాంటి వినూత్న సేవాదృక్పథం వైపు ప్రేరేపించిన అనుభవాలు ఏమిటి? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...
 
మాది మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ గ్రామం. గద్వాలలో టెన్త్ వరకు చదివాను. అక్కడే రాణి మహాలక్ష్మీదేవమ్మ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివాను. 1986లో ఇంటర్ పూర్తికాగానే ధన్వాడకు చెందిన టీచర్ జయశంకర్‌తో నా వివాహం అయింది. పెళ్లీడు కాకపోయినప్పటికీ అమ్మానాన్నల అభీష్టానికి అడ్డు చెప్పలేదు. 1987లో బాబు పుట్టాడు. తర్వాత నా భర్త సహకారంతో టీటీసీ పూర్తిచేశాను. బీఏ కూడా పాసయ్యాను. ప్రస్తుతం కొత్తకోట బాలికల పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాను.
 
జీవితాన్నే మార్చిన ఘటన

బాబు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఓ రోజు ఉదయం ఇంట్లో కిరోసిన్ స్టౌ మీద వంటచేస్తూ, నా పనిలో నేనున్నాను. ఇంతలో బాబు ఆడుకుంటూ స్టౌ దగ్గరికి వెళ్లాడు. స్టౌ మంటల్ని పట్టుకోబోయాడు. గాబరాతో పరుగెత్తుకు వెళ్లి స్టౌను ఊదేశాను. దాంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి కళ్లు అంటుకున్నాయి. చుట్టూ అంధకారం. రెండు కళ్లూ కనిపించకుండా పోయాయి. పక్కింట్లో ఉంటున్న లక్షి్ష్మ పరుగెత్తుకొచ్చి పెరుగులో తడిపిన  పత్తిని తీసుకువచ్చి నా కళ్లపై ఉంచింది. మూడురోజుల పాటు నాకు కళ్లు కనిపించలేదు. ఇక ఈ లోకాన్ని చూడలేనేమోననుకున్నా! మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్లాం. చూపైతే వచ్చింది కానీ.. ‘భవిష్యత్‌లో ఇబ్బంది తలెత్తదని చెప్పలేం’ అని డాక్టర్ అన్నారు. రెండురోజులు కళ్లు లేకపోతేనే జీవితం అంధకారం అయిపోయిందే.. ఇక పుట్టుక నుంచి అంధులుగా ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని అప్పుడు ఆలోచించాను. రోజులు గడుస్తున్న కొద్దీ,  చూపులేనివారికి నా వంతుగా ఏమైనా చేయాలని అనిపిస్తుండేది.  ఆ సమయంలోనే 1989లో నాకు టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే అంధులకు ఏదైనా చేయాలన్న తపనతో 1996లో బ్లైండ్ డిప్లొమా (బ్రెయిలీ లిపిలో) పూర్తిచేశాను.
 
మనోబలమే అంతర్నేత్రం

 ఆధ్యాత్మికంగా, మానసికంగా బలంగా ఉంటే అంధత్వాన్ని ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదని నా నమ్మకం. రోజూ మూడు నుంచి నాలుగు గంటలు కుస్తీ పట్టి,  ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ వాటిని బ్రెయిలీ లిపిలో రాయడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో పాఠ్యపుస్తకాలను కూడా బ్రెయిలీ లిపిలో రాసి విద్యార్థులకు అందజేశాను. ఇలా క్రమంగా ఇతర రచనల వైపు దృష్టిమళ్లింది. పురాణేతిహాసాలు, భారతభాగవతాదులు, నీతికథల పుస్తకాలను బ్రెయిలీలో రాసి అచ్చు వేయించి పంచిపెడుతున్నాను.
 
తల్లిగా అదృష్టవంతురాలిని

 తొమ్మిదేళ్ల క్రితం అనుకోని సంఘటనలో నా భర్త జయశంకర్ మరణించారు. అదే నా జీవితంలో విషాదకరమైన సంఘటన. ఆ తరువాత మా అబ్బాయి నరేంద్రనాథ్ అన్నీతానై చూసుకుంటున్నాడు. ప్రస్తుతం మైసూరు, మాండ్య జిల్లాలో సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. తన సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది. ఏ తల్లికైనా ఇటువంటి కొడుకు పుడితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది. టీచర్‌గా పనిచేస్తున్నా.. ఇప్పటికీ బ్రెయిలీలిపిలో పుస్తకాలు రాయకుండా ఉండలేను. వంటచేయడం సరిగ్గా రాదుకానీ ఈ లిపిలో మాత్రం మంచిప్రావీణ్యం సంపాదించాను. (నవ్వుతూ)
 - ముంగల్‌శెట్టి వెంకటయ్య
 సాక్షి, మహబూబ్‌నగర్ డెస్క్
 
 
సృష్టి సమ్మాన్ అవార్డు


ప్రతిరోజూ కనీసం గంటపాటు పుస్తకాలు చదువుతాను. వాటిని బ్రెయిలీ లిపిలోకి రాస్తాను. అలా మొదట 1 వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను బ్రెయిలీ లిపిలోకి మార్చాను. గణపతి సచ్చిదానంద స్వామివారు ఇచ్చిన బ్రెయిలీప్రింటర్ సహాయంతో పాఠ్యపుస్తకాలను అచ్చువేసి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న అంధుల పాఠశాలతో పాటు అనంతపురం జిల్లా హిందూపురం, హైదరాబాద్‌లోని మలక్‌పేట అంధుల ఆశ్రమపాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందజేయగలిగాను. భగవద్గీత, బైబిల్, ఖురాన్, మహాభారతం, రామాయణం, భాగవతం, జీవిత చరిత్రల పుస్తకాలను బ్రెయిలీ లిపిలో లిఖించగలిగాను. నా పుస్తకాల్లో ‘గురుచరిత్ర’ మరచిపోలేనిది. ఇటీవల కొమురం భీం, ప్రొఫెసర్ జయశంకర్ జీవితచరిత్రలను బ్రెయిలీ లిపిలోకి అనువాదం చేశాను. యాదగిరిగుట్ట ప్రాశస్త్యాన్ని ఈ లిపిలోనే రాశాను. సచ్చిదానంద స్వామీజీ వారి వెయ్యి సూక్తులు కలిగిన బ్రెయిలీలిపి ‘విజయశంకర’ పుస్తకం నాకు మరింత పేరు తెచ్చిపెట్టింది. బ్రెయిలీలో దాదాపు 600 పుస్తకాలకు పైగా రచించినందుకు న్యూఢిల్లీలో ‘సృష్టి సమ్మాన్’ అవార్డు అందుకున్నాను.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement