మర్దనకు మేలైనది...
చర్మ సౌందర్యం
అందం, ఆరోగ్యాన్ని ఏకకాలంలో ప్రాప్తింపజేసే సుగుణాల గని నువ్వులు. నువ్వుల నుంచి తీసిన తైలాన్ని రోజువారీ వాడుకలో భాగం చేసు కుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. నువ్వుల నూనెను మనవాళ్లు ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. నువ్వుల నూనెలో ఎన్నో విటమిన్లు, మినరల్స్, కొవ్వు పదార్థాలు.. ఉంటాయి. మర్దన తైలంగా కూడా ఈ నూనె ప్రసిద్ధి.
బరువు తగ్గచ్చు... నువ్వుల నూనెకు బరువు తగ్గించే సుగుణాలు ఉన్నాయి. కేలరీలు ఈ నూనెలో సమృద్ధిగా ఉంటాయి. వంటలలోనూ, సలాడ్‌లలోనూ ఈ నూనెను వాడటం వల్ల ఇతర ఆహారపదార్థాలను తక్కువ తీసుకుంటాం. ఫలితంగా తీసుకునే ఆహారంపై నియంత్రణ ఉండి, బరువు తగ్గవచ్చు. రోజూ 15-30 నిమిషాల సేపు నువ్వుల నూనెతో ఒంటికి మసాజ్ చేసుకొని, వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. చెమట రూపంలో మలినాలు బయటకు వెళ్లిపోయి మేనికాంతి పెరుగుతుంది.
చర్మకాంతికి...
నువ్వుల నూనె శరీర మర్దనకు మేలైనది. స్వేదరంధ్రాలు తెరుచుకొని మలినాలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. బిగువు కోల్పోదు.
కురులకు నిగారింపు...
మాడు పొడిబారితే శిరోజాల కుదుళ్లు నిర్జీవంగా తయారవుతాయి. ఫలితంగా జుట్టు ఎండిపోయి పీచులా కనిపిస్తుంది. గోరువెచ్చని నువ్వుల నూనెతో మాడుకు మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ పెరుగుతుంది.
నువ్వుల నూనెలోని చలువదనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, వెంట్రుక వృద్ధి అవుతుంది.
మాడు మీద చుండ్రు వంటి ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా నువ్వుల నూనెలోని ఔషధాలు వాటితో పోరాడి సమస్యను నివారిస్తాయి.
సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను అడ్డుకొని జుట్టురాలుడు సమస్యను తగ్గిస్తుంది.
నువ్వుల నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ కలిపి తలకు మసాజ్ చేసుకుంటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నూనెను మాడుకు పట్టించి, మసాజ్ చేసుకొని, వేడి నీటిలో ముంచి, గట్టిగా పిండిన టవల్‌ను తలకు చుట్టాలి. 15 నిమిషాలు తలకు ఇలా ఆవిరిపట్టాక వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
ఆరోగ్యానికి మేలు...
నువ్వుల నూనెలో మోనో, పాలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తాయి. దానిలోని యాంటీ ఆక్సిడెంట్లవల్ల మంచి కొలెస్ట్రాల్ వృద్ధి అవుతుంది.