కొండనాలుకకు మందేస్తే... ఉన్న నాలుక ఊడింది అని సామెతగానీ.. ఈ వార్త మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. జీవితాంతం వాడే మధుమేహం మందుల వల్ల మన వయసుతోపాటు వచ్చే మతిమరపు లక్షణాలు తగ్గుతాయని తాజా పరిశోధన ఒకటి స్పష్టం చేస్తోంది మరి! లాంచెస్టర్ విద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై కొన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నారు. మతిమరుపు వ్యాధి కలిగి ఉన్న ఎలుకలకు లిరాగ్లూటైడ్ అనే మందును ఇచ్చి పరిశీలించారు. కొంతకాలం తరువాత వాటి జ్ఞాపకశక్తికి సంబంధించి కొన్ని పరీక్షలు పెట్టారు. ఎలుకలు మంచి పురోగతి చూపించాయి.
అంతేకాకుండా వీటి శరీరాల్లో నాడుల పనితీరును రక్షించే బ్రెయిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువైనట్లు తెలిసింది. అంతేకాకుండా ఒత్తిడి కారణంగా వచ్చే వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటివి కూడా తక్కువగా ఉన్నాయని, నాడీ కణాలు నాశనమయ్యే వేగం కూడా తగ్గిందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త హోచర్ తెలిపారు. అల్జైమర్స్, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో వస్తూంటాయని, దాదాపు 15 ఏళ్లుగా ఈ వ్యాధులకు కొత్త మందులేవీ లేని నేపథ్యంలో తమ తాజా పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడిందని ఆయన వివరించారు. అల్జైమర్స్ వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్ నిరోధకత కూడా ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో మధుమేహానికి తీసుకునే మందులతోనే మతిమరపు కూడా తగ్గడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment