ఓ ప్రశాంత ఏకాంత సమయాన రాధాకృష్ణుల మధ్య సంభాషణ ఇలా సాగింది.
రాధ: కృష్ణా! నీవింత సుకుమారంగా కనిపిస్తావు, నీ శ్యామల రూపం సమ్మోహన ప్రేమ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. అపారమైన ప్రేమ కారుణ్యాలు నీ యెదలో తాండవిస్తాయి. కానీ నాదొక సందేహం...
కృష్ణుడు: సందేహమెందుకు? అడుగు రాధా!
రాధ: అంతులేని అల్లరి చేష్టలు, వాటితోపాటు రాక్షస సంహారాలు... ఇవన్నీ ఏమిటో నాకర్థం కావటం లేదు కృష్ణా!
కృష్ణుడు: రాధా! నాకు శత్రువులెవ్వరూ లేరు, పనిగట్టుకుని నేనెవ్వరినీ సంహరించడమూ లేదు. ఇవన్నీ ప్రకృతి పరిధిలోనే జరుగుతున్నాయి. దాని నిమయనిర్ణయాల మేరకు జనన మరణాల ప్రస్థానం నాటకీయంగా సాగుతోంది. సృష్టిలోని ప్రతి క దలిక వెనుక ప్రేరణాత్మకమైన ప్రకృతిసూత్రం ఇమిడి ఉంటుంది. చూడు ప్రియసఖీ! రైతు నేలలో విత్తనాలను పాతిపెడతాడు. ద్వేషం చేత కాదు కదా! ఆ విత్తనానికి రైతు చర్య అర్థం కాకపోవచ్చు కాని జరిగేదేమిటంటే ఆ విత్తనంలోంచే పచ్చని మొలక అంకురించి మొక్కగా, చెట్టుగా పరిణతి చెంది ఫలభరితమౌతుంది. అంటే విత్తనంగా మరణిస్తేగాని మొలకగా అంకురించే అవకాశమే లేదు కదా!
ఈ విధంగానే జననమరణాల గమనం కూడా. మరణం పాలబుగ్గల పరిశుద్ధ శిశోదయానికి ముఖద్వారమవుతుంది. చైతన్యవంతమైన ఆత్మకు మరణమెక్కడిది? వివిధ రూపాలుగా అవతరించి మార్పు చెందడం తప్ప. ఈ అవగాహన రహితమైన మనస్సు అనుకూలతను కారుణ్యంగా, ప్రతికూలతను కాఠిన్యంగా భావిస్తుంది. ఈ ప్రకృతే దైవాకృతి. ఈ వైవిధ్య రూపాలన్నీ ప్రకృతి యొక్క విభిన్న పాత్రలే, జనన మరణాలు, సుఖదుఃఖాలు, చీకటి వెలుగులనే ద్వంద్వాలను కల్పించి చిద్విలాస క్రతువు నిరంతరాయంగా జరుపుతుంది ఆ అఖండ జ్ఞానస్వరూపిణియైన పరాప్రకృతి. ఈ జ్ఞానమెరిగి జీవించువాడే స్థితప్రజ్ఞుడు. ఈ జ్ఞానమెరిగి పయనించువాడే మందస్మిత శ్రీమంతుడు... అని ప్రబోధించాడు కలువ కన్నుల కన్నయ్య.
ఆ ప్రబోధంతో రాధ హృదయం ప్రకాశించి, ‘‘ప్రభూ! ఆ సూత్రమూ, ఆ జ్ఞానమూ, ఈ పంచభూతాత్మక విశ్వమూ నీవే కదా! ప్రత్యేకించి ‘ప్రకృతి’ అని సంబోధిస్తావెందుకు?’’ అని రాధమ్మ అంటే అవునన్నట్లు మందహాసంతో తన మధుకాంతిని రాధమీద ప్రసరించి తన అనన్యస్థితిని ప్రకటించాడు కృష్ణ పరమాత్మ.
- (రామకృష్ణానంద రచించిన ‘ఆరాధనామాధవుడు’ నుంచి)