
ఆ క్షణంలో ఏది తోస్తే అదే చేస్తా
వారిది వ్యవసాయ కుటుంబం... అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు... ఇద్దరిలో చిన్నవాడైన శ్రీకాంత్ భారత కీర్తి పతాకను రెపరెపలాడించాడు
సక్సెస్
వారిది వ్యవసాయ కుటుంబం... అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు... ఇద్దరిలో చిన్నవాడైన శ్రీకాంత్ భారత కీర్తి పతాకను రెపరెపలాడించాడు... వరుస సూపర్‌సిరీస్ గెలుచుకున్నాడు... ఒలింపిక్ లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు...తల్లిదండ్రులతో కలిసి సాక్షితో తన అనుభవాలను పంచుకున్నాడు.
‘‘నేను టోర్నమెంట్‌లో గెలిచినా, ఓడినా ఆ మ్యాచ్ గురించి నాన్నగారే మాట్లాడతారు. వేళకి అన్నం తిన్నావా లేదా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా అని అమ్మ అడుగుతుంది. మ్యాచ్ గురించిన వివరాలు అన్నయ్య అడుగుతాడు. నేను గెలిచినా, ఓడినా ఎప్పుడూ నాన్నగారు ఏమీ అనరు. ఏ దెబ్బలూ తగిలించుకోకుండా, జాగ్రత్తగా వేళకి అన్నీ తిన్నానని చెబితే చాలు అమ్మకి నేను ప్రపంచ కప్ సాధించిన ంత సంతోషం. అన్నయ్య కూడా షటిల్ ఆటగాడు కావడం వలన, ఆట గురించి ఇద్దరం చర్చించుకుంటాం. ఇది మా చిన్న కుటుంబంలో ఉండే ఆనందం.
అన్నయ్యతో అడుగులు...
మా అన్నయ్య షటిల్ ఆడుతుంటే నేను కూడా వెళ్లేవాడిని. అలా నాకు షటిల్ బ్యాడ్మింటన్ మీద ఆసక్తి మొదలైంది. నా తొమ్మిదో ఏట నేను షటిల్ ఆడటం ప్రారంభించాను. ఖమ్మంలో వివిసి స్కూల్‌లో చదువుకున్నాను. ఆ తరవాత బిఏ చేశాను. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను.
ఆటలో స్ట్రిక్టు... బయట ఫ్రెండ్లీ
వ్యక్తిగతంగా ఒక ఆటగాడికి ఆటలో బలం ఉంటే వారు తప్పకుండా పైకి రాగలరు. నా వరకు నాకు గోపీచంద్ గాడ్‌ఫాదర్‌తో సమానం. ఆయనే నా కోచ్. ఆయన సహకారం లేకపోతే నేను ఈస్థాయికి వచ్చి ఉండేవాడిని కాదు. ఆట నేర్పేటప్పుడు ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. గ్రౌండ్ బయటకు వచ్చాక ఫ్రెండ్లీగా ఉంటారు. ఆడేటప్పుడు ఏ మాత్రం ఒత్తిడి పడకూడదు. ఆట ఆడేటప్పుడు మనకు ఎలా ఉంటుందో, ప్రత్యర్థికి కూడా అలాగే ఉంటుంది కనుక ఒత్తిడి పడవలసిన అవసరం ఉండదు. పోయిన పాయింట్ గురించి ఆలోచించకుండా, తరవాతి పాయింట్ ఎలా కొట్టాలా అని ఆలోచించాలి.
నా గ్రాఫ్ క్లియర్!
కెరీర్‌లో చిన్నచిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చాలామందితో పోలిస్తే నా గ్రాఫ్ చాలా క్లియర్‌గానే ఉందనుకోవచ్చు. అతి తక్కువ సమయంలో ఎన్నో సాధించగలిగాననే సంతృప్తి నాకుంది. మ్యాచ్ ఆడేటప్పుడు ఆ సమయంలో ఏది కరెక్ట్ అయితే అదే చేస్తాను. అందువల్ల తరవాత పశ్చాత్తాపం ఉండదు. మలేసియా ఓపెన్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్‌నాకు చాలా ఇష్టం. చాలా క్లోజ్‌గా గెలిచాను. నాకు టెన్నిస్ అంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడు ప్రయత్నిస్తుంటాను. కాని సరిగా రావట్లేదు.
మా అమ్మ మాతో ఎప్పుడూ ఒక మాట అనేవారు, ‘చదువు మీద శ్రద్ధ ఉంటేనే చదువుకోవాలి. అంతేకాని రెండు పడవల మీద ప్రయాణం చేస్తే పడవ మునిగిపోతుంది’ అని. ఆవిడ మాటలో వాస్తవాన్ని త్వరగానే తెలుసుకున్నాం. ఆట మీద దృషి కేంద్రీకరించాను. నేను కష్టంలో ఉన్నప్పుడు మా అన్నయ్య అండగా నిలుస్తాడు’’ అంటారు శ్రీకాంత్.
నా వెంటే తిరిగేవాడు
మా అబ్బాయిలిద్దరూ ఆడుకోవడానికి వెళ్లేవారు. పెద్దవాడు గోడ దూకి వెళ్లిపోయేవాడు. చిన్నవాడు గోడ దూకలేక ఏడుస్తూ కూర్చునేవాడు. శ్రీకాంత్ చిన్నప్పుడు నా వెనకాలే ఉండేవాడు. నా పక్కనే పడుకుని కబుర్లు చెప్పేవాడు. వాళ్ల నాన్నగారు పడుకోమంటే దుప్పటి ముసుగు వేసుకుని, కబుర్లు చెప్పేవాడు. అసలు ఎప్పటికైనా వీడు బయటకు Ðð ళ్తాడా, నా వెనకాలే ఉంటాడా అనుకునేదాన్ని. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే నవ్వు వస్తోంది. ఒక్కడే దేశదేశాలు తిరిగి వస్తున్నాడు. పిల్లలను ఆటల్లో రాణిస్తారా లేదా అనేది ప్రాక్టీస్ మొదలు పెట్టిన నాలుగైదేళ్లలో తెలిసిపోతుంది. నైపుణ్యం ఉందనిపిస్తే కొనసాగించాలి. తగదనిపిస్తే, పదవ తరగతి లోపే చదువు వైపు మళ్లించాలి. – రాధా ముకుంద (శ్రీకాంత్ తల్లి)
సరైన నిర్ణయమే!
ఒలింపిక్స్ తర్వాత జాయింట్‌కి సర్జరీ అయ్యింది. అక్టోబరు నుంచి జనవరి వరకు విశ్రాంతి. మళ్లీఫిబ్రవరిలో టోర్నమెంట్‌కి వెళ్లాడు. ఫిజియో థెరపిస్టుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంతేకాదు మా అబ్బాయిని నడిపించిన మొత్తం టీమ్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వరుస సిరీస్‌లో ప్రపంచంలో గెలిచినవారిలో శ్రీకాంత్ ఐదవ స్థానం. 2014లోసెమీస్ కొట్టి, చైనా సూపర్‌సిరీస్ గెలవడం నాకు చాలా ఆన ందంగా అనిపించింది. రెండు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ గెలిచిన లిన్‌డాన్ గెలవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. పదహారు సంవత్సరాల క్రితం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను చాలా భయపడ్డాను, ఇప్పుడు ఇది మంచి నిర్ణయం అని అర్థం చేసుకున్నాను. పిల్లలు ఆటలో గెలిచినప్పుడు బాధనంతా మర్చిపోతారు. ఓడిపోతే, బాధపడతారు. వారు ఎలా ఆడినా వారిని తల్లిదండ్రులుగా ప్రోత్సహించాలి.
– కెవియస్ కృష్ణ
– డా. వైజయంతి